ఒక చేత్తో సిగరెట్.. మరో చేత్తో బాటిల్ లో పెట్రోల్ కొట్టించుకోవటమా?

Update: 2021-03-08 04:41 GMT
నిర్లక్ష్యానికి పరాకాష్ఠ లాంటి పరిణామం ఒకటి కర్నూలు జిల్లా నంద్యాలలో చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ పెట్రోల్ బంకు వద్దకు వెళితేనే.. అక్కడి సిబ్బంది హెచ్చరిస్తారు. అలాంటిది చేత్తో సిగరెట్ తాగుతూ.. మరో చేత్తో బాటిల్ లో పెట్రోల్ కొట్టించుకునే వేళ చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకరు మరణించారు. పూర్తిగా నిర్లక్ష్యం.. అలక్ష్యమే ఈ దారుణ ఘటనకు కారణంగా చెప్పాలి. అసలు చేత్తోసిగరెట్  పట్టుకొని పెట్రోల్ బంకు వద్దకు వచ్చినంతనే.. పంపించేయాల్సిన సిబ్బంది ఏం చేస్తున్నట్లు? అన్నది ప్రశ్న.

నంద్యాల పట్టణానికి చెందిన 35 ఏళ్ల జాక్సన్ మూడేళ్ల క్రితం మండలానికి చెందిన మేరీతో వివాహమైంది. అతగాడు కర్ణాటకలోని హోస్ పేటలో బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నారు. అత్తగారి ఊరైన చాబోలుకు ఫిబ్రవరిలో వచ్చారు. అదే నెల 28న ఒక చేత్తో సిగరెట్ తాగుతూ.. మరో చేతితో బైక్ లోని సీసాతో పెట్రోల్ కొట్టించుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది.

ఈ ఘటనలో జాక్సన్ తీవ్రంగా గాయపడ్డారు. పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో ఒంటి మీద పెట్రోల్ పడటం.. సిగరెట్ నిప్పు రవ్వలతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అతడ్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు తాజాగా మరణించాడు. అతడి భార్య మేరీ ఫిర్యాదుతో కేసు కట్టిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. షాకింగ్ గా ఉన్న ఈ ఉదంతంలో.. సిగరెట్ కాలుస్తూ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకోవటమా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News