బీజేపీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ గాలం!

Update: 2019-06-02 08:05 GMT
కర్ణాటక రాజకీయాల్లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత విధానసభ ఎన్నికల్లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పాటు కావడంతో ఉన్నఫలంగా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ జత కట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా కేబినెట్‌లో చోటు దక్కని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగింది. ఏడాది కాలంలో ఆరుసార్లు ఆపరేషన్‌ కమల్‌ నిర్వహించిన కమలనాథులు ప్రతిసారీ విఫలమయ్యారు. అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ కర్ణాటకలోని నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు సీఎల్పీ నేత - మాజీ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో వ్యూహం పన్నినట్లు సమాచారం. ఈమేరకు ఆ నలుగురు ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య ఇప్పటికే ఫోన్‌ లో కూడా మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 బీజేపీని అధికారానికి దూరం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ జత కట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈక్రమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక బీజేపీకి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో సీఎల్పీ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య బీజేపీ నేతలకు చెక్‌ పెట్టేందుకు ‘ఆపరేషన్‌ హస్తం’ మొదలుపెట్టారు. ఈమేరకు బీజేపీలోని నలుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుని కమలనాథులకు గట్టి షాక్‌ ఇస్తారని సమాచారం. హైదరాబాద్‌ కర్ణాటకలో సిద్ధరామయ్య మద్దతుదారులుగా ఉన్న వారితో టచ్‌లోకి వెళ్లి కాంగ్రెస్‌ లోకి చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొప్పళ జిల్లా కనకగిరి ఎమ్మెల్యే బసవరాజ్ - యాదగిరి జిల్లా సురపుర ఎమ్మెల్యే రాజుగౌడ - బళ్లారి జిల్లా సిరిగుప్ప ఎమ్మెల్యే సోమలింగప్ప - రాయచూరు ఎమ్మెల్యే డాక్టర్‌ శివరాజ్‌ పాటిల్‌ను కాంగ్రెస్‌ లోకి ఆహ్వానించినట్లు తెలిసింది.

 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీజేపీ మరోసారి సంపూర్ణ మెజారిటీ సాధించి కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా కర్ణాటకలో కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి వేసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనే వార్తలు వినిపించాయి. అయితే కేంద్రం నుంచి బీజేపీ నేతలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. ఫలితంగా స్థానిక బీజేపీ నాయకులు ఆపరేషన్‌ కమల్‌ కు విరామం ప్రకటించాల్సి వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్‌ లోని అసంతృప్త ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసినప్పటికీ కాంగ్రెస్‌ – జేడీఎస్‌ పెద్దలు అప్రమత్తం అయ్యారు. అంతేకాకుండా తాజాగా ‘ఆపరేషన్‌ హస్తం’ మొదలుపెట్టారు. ఇప్పట్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేయొద్దని బీజేపీ అధిష్టానం.. యడ్డూరప్పకు సందేశాలు ఇవ్వడంతో కేబినెట్‌ బెర్తు ఆశించిన బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ లోకి వెళ్లేందుకు మంతనాలు చేసినట్లు తెలిసింది.


Tags:    

Similar News