కాంగ్రెస్ కు సిద్దరామయ్య మాస్టర్ స్ట్రోక్.. దెబ్బతో పార్టీ కుదేల్?

Update: 2022-05-08 03:17 GMT
మరికొద్ది నెలల్లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 2023 తొలినాళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కీలకమైనది కర్ణాటక. ప్రస్తుతం బీజేపీ ఏలుబడిలో ఉన్న ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కమలనాథులు వ్యవహరించిన తీరుపై బోలెడన్ని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేనప్పటికీ.. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ ను చీల్చేయటం ద్వారా కన్నడ నాట బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా చేయటం తెలిసిందే.

కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు బీజేపీ అధినాయకత్వం గాలం వేసినట్లుగా చెబుతున్నారు. ఆయన్ను తమ పార్టీలో చేరాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. చేతిలో అధికారం ఉన్నా.. రాష్ట్రాన్ని సరైన పద్దతిలో నడిపించే నాయకత్వం లేని నేపథ్యంలో.. ఆ కొరతను తీర్చేందుకు వీలుగా సిద్ధరామయ్యను ఎంపిక చేసుకున్నట్లుగా చెబుతున్నారు.2023లో జరిగే ఎన్నికల నాటికి తమ పార్టీలో సిద్దూను చేర్చుకోవటం ద్వారా కాంగ్రెస్ కు చావుదెబ్బ కొట్టాలన్న ప్లాన్ చేస్తోంది బీజేపీ.

కమలనాథుల నుంచి వచ్చిన ఆఫర్ కు పాజిటివ్ గానే సిద్ధూ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. తన వర్గానికి చెందిన నేతలకు టికెట్లు ఇవ్వాలని.. 20 మంది టికెట్లు తాను చెప్పిన వారికే ఇవ్వాలన్న కండీషన్ సిద్దూ పెట్టినట్లుగా చెబుతున్నారు. దీనికి సానుకూలంగా బీజేపీ అధినాయకత్వం అంగీకరిస్తే.. పార్టీమారటానికి తనకు ఎలాంటిఅభ్యంతరం లేదన్న మాటను చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఏం చేయాలన్న దానిపై బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం కొలువు తీరి ఉన్న బీజేపీ ప్రభుత్వంలోని మంత్రుల్లో 15 మంది వరకు సిద్ధరామయ్య అనుచరులుగా చెబుతారు. కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారులో తమకు ప్రాధాన్యత లభించలేదని పేర్కొంటూ వీరంతా జట్టుగా మారి బీజేపీలోకి వెళ్లటం.. వారికి మంత్రి పదవులు దక్కటం తెలిసిందే. ఇలా వెళ్లిన వారంతా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగింది ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల నాటికి తమ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో బీజేపీ అగ్ర నాయకత్వం ఉందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా తాము బలహీనంగా ఉండే మైసూర్ ప్రాంతంలో పట్టు సాధించేందుకు సిద్ధూ సాయం తీసుకోవాలని భావిస్తున్నారు. మొత్తం 225 (ఒక నామినేట్ ఎమ్మెల్యేను తీసేస్తే 224 ) అసెంబ్లీ స్థానాల్లో మైసూర్ ప్రాంతంలో ఉన్నవి 89 అసెబ్లీ నియోజకవర్గాలు అయితే.. అందులో పది మాత్రమే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. సిద్దూను పార్టీలో చేర్చుకోవటం ద్వారా మైసూర్ ప్రాంతం మీద పట్టు సాధించటంతో పాటు.. తన ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని పెంచుకోవచ్చని భావిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వినిపిస్తున్న అంచనాలు నిజమై.. సిద్దూ కానీ బీజేపీలోకి చేరిపోతే.. కాంగ్రెస్ కు కరెంటు షాక్ గా మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందన్నది కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.
Tags:    

Similar News