హీరో భార్య రాజకీయం..అధికార పార్టీల్లో వణుకు!

Update: 2019-03-18 06:33 GMT
కర్ణాటకలో అధికారాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్ – జేడీఎస్ పార్టీలు.. సీట్ల ఒప్పందంలో భాగంగా ఎవరికి ఏ సీటు అనే విషయం గురించి సులభంగా తేల్చుకున్నాయి కానీ, అలా తేల్చుకున్నాకా.. మండ్య ఎంపీ సీటు విషయంలో సుమలత పోటీకి రావడం మాత్రం ఆ పార్టీలకు మింగుడు పడటం లేదు. సుమలతను రాజకీయంగా ఎదగనీయకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ప్రత్యేకించి కర్ణాటక సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఈ విషయంలో గట్టిగా ఉన్నాడు. గతంలో అంబరీష్ విషయంలోనూ సిద్ధరామయ్య గట్టిగా వ్యవహరించాడు.

అంబరీష్ ను మంత్రి వర్గం నుంచి తప్పించాడు సిద్ధరామయ్య. ఆ స్టార్ హీరో అలిగినా ముఖ్యమంత్రిగా అప్పుడు ఈయన పట్టించుకోలేదు. అంబరీష్ మరణం అనంతరం ఇప్పుడు సుమలత రాజకీయంగా యాక్టివ్ కాదలుచుకుంటున్న నేపథ్యంలో.. సిద్ధరామయ్య రొటీన్ గానే అడ్డుపుల్లలు వేశాడు. ఆ సీటును జేడీఎస్ కు కేటాయించేసినట్టుగా ప్రకటించుకున్నాడు. తమకు సంబంధం లేదన్నాడు.

ఇక జేడీఎస్ వాళ్లు ఈ సీటు నుంచి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడను బరిలోకి దించడం ఖరారు అయ్యింది. దేవేగౌడ మనవడు తమ కులంకోట అయిన మండ్య నుంచి పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నాడు. అయితే తమ కులానికే చెందిన అంబరీష్ కు మండ్య ప్రాంతంలో పట్టుందనే విషయం జేడీఎస్ కు తెలియనిది ఏమీ కాదు. అందుకే సుమలత అక్కడ నుంచి పోటీ చేయడానికి ఈ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ విషయంలో జేడీఎస్ నేతలు సహనం కోల్పోయారు.

సుమలత విషయంలో ఇష్టానుసారం మాట్లాడారు. ఆ మాటలు వివాదాస్పదం అయ్యాయి కూడా. చివరకు అతి చేసి.. తర్వాత క్షమాపణలు చెప్పుకున్నారు.

మరోవైపు సుమలతకు అన్నివైపుల నుంచి మద్దతు లభిస్తూ ఉంది.ఆమె కోరితే మద్దతుకు రెడీ అని బీజేపీ ప్రకటించింది. మండ్య ప్రాంతంలో బీజేపీకి ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉంది. ఇక గౌడ కులంలో అంబరీష్ కు పట్టున్న నేపథ్యంలో.. సానుభూతి కూడా సుమలత వైపు మొగ్గు చూపుతోంది. అంత కన్నా ఆసక్తిదాయకమైన విషయం కాంగ్రెస్ లో చీలిక.

ఎలాగూ తమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు. అలాంటప్పుడు జేడీఎస్ కు ఎందుకు సపోర్ట్ చేయాలన్నట్టుగా.. కొంతమంది కాంగ్రెస్ నేతలు సుమలత వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇది కాంగ్రెస్- జేడీఎస్ ల అధినాయకత్వాలకు తలపోటుగా మారింది. పరిస్థితి ఇలా అవుతుందని ఆ పార్టీల నేతలు  అనుకోలేదు. సుమలత మీద సానుభూతి తో పాటు..అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తూ ఉండటంతో.. ఆ పార్టీలు  ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కానట్టుగా కనిపిస్తున్నాయి!
Tags:    

Similar News