సిద్ధిపేట ఆర్టీవోకు సీఎం పేషీ సలాం..?

Update: 2015-09-01 04:53 GMT
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలకంగా వ్యవహరించి.. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన తెలంగాణ ఉద్యోగ సంఘాలు తమ సర్వీసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని కోరారు.  ఒక దశలో తీవ్రంగా ప్రయత్నించారు కూడా. అయితే.. మిగిలిన వరాల్ని ఉదారంగా ప్రకటించే కేసీఆర్.. సర్వీసు పొడిగింపు విషయంలో మాత్రం ససేమిరా అన్నారు. అంతేకాదు.. తన రాజకీయ ప్రత్యర్థి... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసును 60ఏళ్లకు పెంచినా.. తాను మాత్రం 58 ఏళ్లకే ఫిక్స్ అయ్యారు.

మిగిలిన విషయాల్లో బాబుతో పోటీ పడుతూ.. బాబు కంటే ఒక అడుగు ముందు ఉండేందుకు ఇష్టపడే కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు విషయంలో మాత్రం వెనక్కి తగ్గారు. అలాంటి ఆయన.. తాజాగా సిద్దిపేటకు చెందిన ఆర్డీవో రిటైర్మెంట్ వయసును పెంచేందుకు మాత్రం ఓకే చెప్పేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ సర్కారులో కీలక భూమిక పోషించే మంత్రి హరీశ్ రావు చలవో.. ఆయన ప్రత్యేక శ్రద్ధో కానీ.. సిద్ధిపేటకు చెందిన ఆర్డీవో ఏసురత్నం అనే అధికారి రిటైర్ మెంట్ విషయంలో సీఎం పేషీ స్వయంగా పెద్ద మనసు చూపించటం చర్చగా మారింది. ఒక అధికారి విషయంలో సీఎం పేషీ అనుసరించిన వైనం.. పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.

జూలై 31న ఉద్యోగ విరమణ చేయాల్సిన ఆయనకు.. రెండేళ్ల పాటు సర్వీసు పొడిగిస్తున్నట్లుగా పేర్కొంది. సాధారణంగా ఎవరైనా అధికారిని రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన సేవలు వినియోగించుకోవాలంటే.. ఓఎస్డీగా నియమించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఔట్ సోర్సింగ్.. కాంట్రాక్ట్ పద్ధతిలో మాత్రమే తీసుకునే వీలుంది. కానీ.. రాజే తలుచుకుంటే నిబంధనలు ఏమున్నాయ్.. అలా మారిపోతాయ్ అన్న దానికి అనుగుణంగా తాజాగా ఏసురత్నం ఉద్యోగ సర్వీసు పొడిగింపులో సీఎం పేషీ తనకున్న విచక్షణాధికారాన్ని వినియోగించింది.

ఆసక్తికరంగా ఏసురత్నం సర్వీసు పొడిగింపు విషయంలో చూపించిన కారణాల్లో.. రాష్ట్రస్థాయి అధికారుల విభజన ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పారు. అయితే.. రిటైర్ మెంట్ అయిన ఆర్టీవో పదవి రాష్ట్రస్థాయి కాదు మల్టీజోన్ మాత్రమే కావటం గమనార్హం. ఇలా.. ఏసురత్నం సర్వీసు పొడిగింపు విషయంలో తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయం.. ఉద్యోగుల్లో విస్మయాన్ని గురి చేస్తోంది. ఏది ఏమైనా సిద్ధిపేట అధికారి అనుకోవాలేకానీ.. సీఎం పేషీ కూడా సలాం అంటుందన్న మాట ఇప్పుడు తెలంగాణ ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News