రష్యా వ్యాక్సిన్ దెబ్బేసినట్లేనా.. క్లినికల్​ ట్రయల్స్​లో సైడ్​ఎఫెక్ట్స్​ !

Update: 2020-09-21 17:37 GMT
రష్యా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​లో ఆశించిన ఫలితాలు రావడం లేదా.. మూడో దశలో భాగంగా ఇచ్చిన క్లినికల్​ ట్రయల్స్​ తీసుకున్న దాదాపు 14 శాతం మందికి సైడ్​ఎఫెక్ట్స్​ వచ్చాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. రష్యా ప్రభుత్వం హడావిడిగా, ప్రతిష్ఠాత్మకంగా స్పుత్నిక్​-వి పేరుతో కరోనాకు వ్యాక్సిన్​ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా మేమే వ్యాక్సిన్​ తీసుకొచ్చామంటూ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్​ ప్రకటించాడు. అంతేకాక తన కూతురికే తొలి వ్యాక్సిన్​ ఇప్పించి సంచలనం సృష్టించాడు. అయితే మొదటి నుంచి ఈ వ్యాక్సిన్​పై ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల శాస్త్రవేత్తలు అభ్యంతరం తెలిపారు. మరోవైపు రష్యా క్లినికల్​ ట్రయల్స్​ డాటాను బయటకు చెప్పకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాగా కొన్ని ప్రపంచ ప్రఖ్యాత మెడికల్​ జర్నల్స్​ రష్యా వ్యాక్సిన్​ సత్ఫలితాలు ఇచ్చిందని.. వ్యాక్సిన్​ తీసుకున్న వారందరిలోనూ యాంటీబాడీస్​ ఉత్పత్తి అవుతున్నాయని వార్తలు ప్రచురించాయి.

అయితే ఈ వ్యాక్సిన్​పై పలు దేశాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే ఈ విషయంలో రష్యా ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. కాగా తాజాగా రష్యా ఆరోగ్య మంత్రి ఓ కీలక ప్రకటన చేశారు. ‘ క్లినికల్ ట్రయల్స్​ భాగంగా మేము వలంటీర్లకు వ్యాక్సిన్లు ఇచ్చాం. అయితే 14 శాతం మందిలో ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి లక్షణాలు వచ్చాయి.

ఇది చాలా సర్వసాధారణమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా వ్యాక్సిన్లలో ఇటువంటి సైడ్​ఎఫెక్ట్స్​ ఉంటాయి. దాని వల్ల వ్యాక్సిన్​కు వచ్చిన ముప్పు ఏమీ లేదు. మూడో క్లినికల్ ట్రయల్స్​లో 300 వలంటీర్లలో కేవలం 14 శాతం మందికి మాత్రమే స్వల్ప సైడ్​ఎఫెక్ట్స్​ వచ్చాయి.

ఎవరూ ఆందోళన చెందవలిసిన అవసరం లేదు. వారికి వచ్చిన అనారోగ్యం కేవలం 2 లేదా 3 రోజుల్లో తగ్గిపోతుంది. కొంతమంది పనిగట్టుకొని రష్యా వ్యాక్సిన్​పై దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారి ఉద్దేశాలు ఏమిటో మాకు స్పష్టం తెలుసు’ అని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్​ వేయించుకున్న వారికోసం రష్యా ప్రభుత్వం ఓ యాప్​ను రూపొందించింది. ఒకవేళ ఎవరికైనా వ్యాక్సిన్​ వేయించుకున్నాక అనారోగ్యంగా అనిపిస్తే యాప్​ ద్వారా ఆయన సూచించారు. వారికి వైద్యసిబ్బంది తగిన వైద్యసహాయం అందిస్తారని చెప్పారు. అయితే ప్రస్తుతం రష్యా అభివృద్ది చేస్తున్న వ్యాక్సిన్​ విజయవంతమై మనదేశంలో కూడా అందుబాటులోకి రావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
Tags:    

Similar News