ల‌క్ష‌లాది మ‌రాఠాలు రోడ్ల మీద‌కొచ్చారెందుకు?

Update: 2017-08-10 04:49 GMT
మ‌హా మంబ‌యి స్తంభించింది. కాషాయ జెండాల‌తో.. టోపీల‌తో రోడ్ల మీద‌కు వ‌చ్చిన ల‌క్ష‌లాది మ‌రాఠాల దెబ్బ‌కు యావ‌త్ దేశం ఒక్క‌సారిగా షాక్ తింది. ఇంత భారీ ఎత్తున నిర్వ‌హించిన మౌన‌ప్ర‌ద‌ర్శ‌న ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌మంది మ‌రాఠాలు ఎందుకు క‌దిలారు. వాళ్లు.. వీళ్లు తేడా లేకుండా డ‌బ్బావాలాలు.. ఉద్యోగులు స‌హా యువ‌కులు పెద్ద ఎత్తున రోడ్ల మీద‌కు ఎందుకు వ‌చ్చారు?  వారిని అంత‌గా క‌దిలించిన అంశాలేమిటి? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

మ‌హారాష్ట్ర న‌లుమూల‌ల నుంచి త‌ర‌లివ‌చ్చిన మ‌రాఠాల‌తో ముంబ‌యి మొత్తం నేల ఈనిందా? అన్న‌ట్లుగా త‌యారైంది. ఇంత‌కూ ల‌క్ష‌లాది మ‌రాఠాల్ని స‌మీక‌రించింది ఎవ‌రు?ఈ భారీ శాంతి ప్ర‌ద‌ర్శ‌న వెనుక ఎవ‌రు ఉన్నారు? ఎందుకింత భారీగా మ‌రాఠాలు ఉద్య‌మించారు? అన్న‌ది చూస్తే..

మ‌హారాష్ట్ర జ‌నాభాలో దాదాపు 35 శాతం మంది మ‌రాఠాలే. వీరిలో అత్య‌ధికులు చెరుకునే సాగు చేస్తుంటారు. పెరుగుతున్న నిరుద్యోగం.. రైతుల ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో పాటు కోప‌ర్డీ ఘ‌ట‌న‌తో వారు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌టంతోపాటు.. కోప‌ర్డీ కేసులో దోషుల్ని శిక్షించే విష‌యంలో వారు జ‌రుగుతున్న జాప్యంపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు ఎస్సీ..ఎస్టీ వేధింపుల నిరోధ‌క చ‌ట్టం దుర్వినియోగం కాకుండా స‌వ‌ర‌ణ‌లు చేయ‌టం.. రైతుల రుణ‌మాఫీ.. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాల‌న్న‌ది వారి డిమాండ్లు. ఇక‌.. ఇంత మందిని స‌మీక‌రించ‌టం వెనుక స‌క‌ల్ మ‌రాఠా స‌మాజ్ ఉంది. మ‌రాఠా క్రాంతి మోర్చా పేరిట‌.. ఒక మ‌రాఠా ల‌క్ష మందితో స‌మానం అన్న నినాదంతో ముంబ‌యి ద‌ద్ద‌రిల్లింది.

ఈ శాంతి ప్ర‌ద‌ర్శ‌న ఉద‌యం 11 గంట‌ల‌కు మొద‌లై సాయంత్రం వ‌ర‌కూ సాగింది. దాదాపు 10 కిలోమీట‌ర్ల మేర సాగిన ఈ శాంతి ప్ర‌ద‌ర్శ‌న కోసం 10వేల మంది పోలీసులు విధులు నిర్వ‌ర్తించారంటే ఇదెంత పెద్ద‌దో చెప్పొచ్చు. ప్ర‌ద‌ర్శ‌న నేప‌థ్యంలో ముంబ‌యిలో ట్రాఫిక్‌.. ర‌వాణా వ్య‌వ‌స్థ దాదాపుగా నిలిచిపోయింది. దీంతో.. స‌బ‌ర్బ‌న్ రైల్వేల‌పై భారీగా భారం ప‌డింది. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో మూడు ల‌క్ష‌ల మంది పాల్గొన్న‌ట్లు పోలీసులు చెబుతుంటే.. కాదు ఎనిమిది ల‌క్ష‌ల మంది పాల్గొన్న‌ట్లుగా మీడియా సంస్థ‌లు చెబుతున్నాయి.

ఈ ప్ర‌ద‌ర్శ‌న‌కు రిజ‌ర్వేష‌న్లతో పాటు.. మ‌రో భావోద్వేగ అంశం కూడా భారీగా క‌దిలించింద‌ని చెప్పాలి. ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్బ‌య ఘ‌ట‌న‌ను త‌ల‌పించేలా ఏడాది క్రితం అహ్మ‌ద్ న‌గ‌ర్ జిల్లా కోప‌ర్డీ గ్రామంలో ఒక మ‌రాఠా బాలిక (14ఏళ్లు) పై కొంత‌రు అత్యంత కిరాత‌కంగా అత్యాచారం జ‌రిపి హ‌త‌మార్చారు. మ‌హారాష్ట్రను కుదిపేసిన ఈ ఘ‌ట‌న‌పై ఏడాది క్రితం ఔరంగాబాద్ లో తొలి ప్ర‌ద‌ర్శ‌న‌ను నిర్వ‌హించారు. అప్ప‌టినుంచి దాదాపు 58 ప్ర‌ద‌ర్శ‌న‌ల్ని నిర్వ‌హించిన వారు.. తాజాగా ముంబ‌యిలో ఈ భారీ ప్ర‌ద‌ర్శ‌న‌ను నిర్వ‌హించారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో శివ‌సేన కూడా పాల్గొన‌గా.. త‌మ‌కు రాజ‌కీయ జోక్యం అవ‌స‌రం లేదంటూ ప్ర‌ద‌ర్శ‌న‌కారులు పార్టీ బ్యాన‌ర్ల‌ను చించేశారు.

ఈ భారీ ప్ర‌ద‌ర్శ‌న మ‌హారాష్ట్ర  ప్ర‌భుత్వాన్ని క‌దిలించింది. ల‌క్ష‌లాది మంది రోడ్ల మీద‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో వారి డిమాండ్ల‌పై రాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ అసెంబ్లీలో ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ఓబీసీల‌కు ఇస్తున్న అన్ని ర‌కాల విద్యా రాయితీల‌ను మ‌రాఠా విద్యార్థుల‌కు వ‌ర్తింప‌చేస్తామ‌ని.. మ‌రాఠాల‌కు వివిధ ప‌థ‌కాల అమ‌లుకు సంబంధించిన స‌మీక్ష కోసం కేబినెట్ ఉప‌సంఘాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక‌.. అసెంబ్లీ బ‌య‌ట కోప‌ర్డీ కేసు విచార‌ణ పూర్తి కావొచ్చింద‌ని.. త్వ‌ర‌లోనే తీర్పు వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News