వరంగల్‌ బరిలో సిరిసిల్ల

Update: 2015-10-31 09:55 GMT
వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల లెక్కలు తేలుతున్నాయి. ఇప్పటికే టీఆరెస్ తన అభ్యర్థిని ప్రకటించగా ఈ రోజు కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను వరంగల్ బరిలో దించారు. 2009 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన రాజయ్య గత ఎన్నికల్లో అప్పటికి టీడీపీలో ఉన్న కడియం శ్రీహరి చేతిలో ఓటమి పాలయ్యారు.  శ్రీహరి చేతిలో 3 లక్షల 96 వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ వివేక్ ల పేర్లు పరిశీలించినప్పటికీ స్థానికుడైనందున కాంగ్రెసు అధిష్టానం రాజయ్య వైపే మొగ్గు చూపింది.

కాగా, వామపక్షాలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్‌ ను బరిలోకి దింపాలని నిర్ణయించాయి. తమ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ప్రతిపక్షాల మధ్య పోటీని నివారించాలని కాంగ్రెస్ నాయకులు వామపక్షాలను కోరారు. అయితే, అందుకు వామపక్షాలు అంగీకరించలేదు. సిపిఐ - సిపిఎంలతో కాంగ్రెస్ నాయకులు శనివారం మంతనాలు జరిపారు. గాలి వినోద్ కుమార్ వంటి విద్యావంతుడిని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దింపితే తాము మద్దతు ఇస్తామని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు కాంగ్రెసు పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు.

ఇక్కడి ఎంపీ కడియం శ్రీహరి టీఆరెస్ లో చేరి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి అందుకోవడంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఖాళీ అయిన స్థానానికి ప్రస్తుతం ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. టీఆరెస్ ఇప్పటికే పసుసూరి దయాకర్ ను తన అభ్యర్థిగా ప్రకటించగా తాజాగా కాంగ్రెస్ కూడా రాజయ్యను బరిలో దింపుతూ నిర్ణయం తీసుకుంది. ఇక టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తే అంచనాలు తెలుస్తాయి. టీడీపీ - బీజేపీలు కలిసికట్టుగా బీజేపీ కేండిడేట్ ను దించాలని నిర్ణయించినా ఎవరిని పోటీలో ఉంచుతారన్నది ఇంకా తెలియలేదు. అందులో క్లారిటీ వస్తే వరంగల్ ఉప ఎన్నికలో బలాబలాలపై స్పష్టత వస్తుంది.
Tags:    

Similar News