సీఎం అభ్యర్థి సీతక్క అయితే.. తెలంగాణ సీన్ లో భారీ ఛేంజ్?

Update: 2023-07-11 09:47 GMT
కొన్నిసందర్భాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి అనుకోకుండా తెర మీదకు వచ్చింది. మరో నాలుగు నెలల వ్యవధి లో తెలంగాణ రాష్ట్రానికి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరు గా సాగుతున్న సంగతి తెలిసిందే. తమకు తాము.. అధికారం లోకి వచ్చేసినట్లే అంటూ కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకుంటూ ఉంటే.. అందుకు భిన్నంగా గులాబీ నేతలు మాత్రం ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. గులాబీ బాస్ అయితే.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో విజయానికి కావాల్సిన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అనూహ్యంగా రేవంత్ నోటి నుంచి వచ్చిన..'సీఎంగా సీతక్క' మాట తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే.. ఈ తరం రాజకీయాల్లో అందినకాడికి దోచుకోవటం.. దాచుకోవటం.. వేలాది కోట్లు వెనకేసుకోవటం లాంటి పనులు చేస్తున్న నేతల కు భిన్నంగా.. సేవా భావం తో వ్యవహరిస్తూ.. అనునిత్యం ప్రజల కు అందుబాటు లో ఉండటమే కాదు.. ఆడంబర జీవితానికి భిన్నంగా.. ఆదర్శవంతంగా వ్యవహరిస్తున్న రాజకీయ నేతల్లో సీతక్క ముందంటారు.

ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విమర్శ.. ఆరోపణలు ఎదుర్కొని రాజకీయ నేతలు అరుదు గా ఉంటారు. ఆ కోవలోకే సీతక్క రావటం.. ఆమె సీఎం అభ్యర్థిగా ఫోకస్ అయితే.. తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకోవటం ఖాయమంటున్నారు. నిరాడంబరంగా ఉండే ఈ తరం రాజకీయనేతలు అరుదుగా కనిపిస్తారు. వరదలు ముంచెత్తినా కాళ్లకు చెప్పుల్లేకుండా కొండ కోనల్లో ఉండే గిరిజనుల కు ఆహార పదార్థాలు అందించే ఆమెకు చెందిన పలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంటాయి.

నిస్వార్థంగా వ్యవహరించే సీతక్క అంటే.. పార్టీల కు అతీతంగా రాజకీయ వర్గాల్లో ఆమె మీద ప్రత్యేక అభిమానమే కాదు.. సానుకూల వైఖరి కూడా కనిపిస్తూ ఉంటుంది. సీఎం కేసీఆర్ కు ధీటైన నేత ను చూసినప్పుడు.. అందరూ తేలిపోయే పరిస్థితి. అందుకు భిన్నంగా గుణంలోనూ.. శ్రమించే తీరులోనూ.. ఆదర్శవంతమైన రాజకీయ నేతగా కేసీఆర్ కంటే సీతక్క ముందు ఉంటారన్నది పలువురి వాదన.ప్రజా జీవితం లో ఉన్నప్పుడు విమర్శల కు గురి కావటం.. ఆరోపణలు ఎదుర్కోవటం.. సంపన్నులుగా మారటం లాంటివి మామూలుగా జరిగిపోతుంటాయి. కానీ.. వాటికి దూరంగా ఉండే సీతక్క.. తనను ఎన్నుకున్న ప్రజల కు అందుబాటు లో ఉండాలన్న తపనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

గత ఎన్నికల్నిచూస్తే.. గిరిజనులు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో.. గిరిజనుల ఓట్ల కోసం ఓవైపు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి వేళలో అనూహ్యంగా సీఎం అభ్యర్థిగా సీతక్క పేరు తెర మీదకు రావటంతో.. ఆమెకు మించిన ఉత్తమ ఆప్షన్ మరొకటి ఉండదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే.. ఈ ప్రచారం భట్టి వర్గీయుల కు మింగుడుపడని రీతి లో మారిందంటున్నారు.

సీతక్క ను సీఎం గా చేస్తే.. తెలంగాణ లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా.. తొలి గిరిజన నేతగా.. తొలి మాజీ మావోయిస్టుగా ఆమె చరిత్రను సృష్టించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఆదర్శాలు వల్లించే ప్రజలు.. ఆదర్శవంతమైన నేతల్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి.. సీతక్క విషయం లో ఏం జరుగుతుందో చూడాలి. ఏమైనా.. రేవంత్ నోటి నుంచి వచ్చిన సీఎం అభ్యర్థి సీతక్క మాట తెలంగాణ రాజకీయ సమీకరణాల్ని మొత్తంగా మార్చే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.

Similar News