వైసీపీ నుంచి ఫస్ట్ వికెట్ : ఆ కీలక ఎమ్మెల్యే జారిపోతారా...?

Update: 2022-10-07 09:30 GMT
ఏపీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో అయిదుగురు  ఇతర పార్టీల నుంచి మద్దతుగా నిలబడ్డారు. సో అసెంబ్లీలో ఆ పార్టీ బలం 156 మంది అన్న మాట. ఇంత బలమైన పార్టీ నుంచి బయటకు వెళ్లారని ఎవరూ అనుకోరు. కానీ ఇది రాజకీయం. ఇక్కడ ఎవరికి వారికి వ్యక్తిగత అవసరాలే ఎక్కువగా ఉంటాయి. అటు అధినాయకత్వం కూడా పెర్ఫార్మెన్స్ చూపించలేని వారిని తీసి పక్కన పెడుతుంది. మరి తమకు చాన్స్ రాకపోతే వారు కూడా పార్టీకి  విధేయత ప్రదర్శిస్తూ  ఖాళీగా వుంటూ గోళ్ళు గిల్లుకోరుగా.
 
అందువల్ల ఇపుడు కాకపోయినా ఎన్నికల వేళకు వైసీపీ కొంతమంది వైసీపీ  సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తే మాత్రం వారు పక్క దారి పడతారని, జంపింగ్స్ కి రెడీ అవుతారని రాజకీయాలు తెల్సిన వారు ఊహించే విషయమే. ఒక వైపు జగన్ కూడా ఎమ్మెల్యే పనితీరు మారుకోవాలని గట్టిగా ఒకటికి పదిసార్లు హెచ్చరిస్తున్నారు. మీరు కనుక పనితీరు మెరుగుపరచుకోకపోతే టికెట్లు ఇవ్వమని కూడా హై కమాండ్ చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

దాంతో చాలా మంది దారిలో  పడ్డారు. కొందరైతే మరింత గట్టిగా పనిచేసి  పనితీరుని మెరుగుపరచుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం తమ వల్ల కాదు ఈ టాస్కులు ఈ  లెక్కలు ఈ  పెర్ఫార్మెన్సులు అని భావిస్తున్నారేమో. ఇక ఎంత చేసినా తమ గ్రాఫ్ పెరగదని భావించే ఇలాంటి వారు పక్క చూపులు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. అలాంటి వారిలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నట్లుగా గుసగుసలు అయితే  జోరుగా వినిపిస్తున్నాయి.

ఆయన పార్టీ మారేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారని అదే కనుక జరిగితే వైసీపీ నుంచి జారిపోయే ఫస్ట్ ఎమ్మెల్యే ఈయనే అవుతారని కూడా అంటున్నారు. ఇక పెండెం దొరబాబు విషయం తీసుకుంటే నియోజకవర్గం వైసీపీలో గ్రూపులు ఉన్నాయి. ఆయన వాటిని కలుపుకుని ముందుకు సాగడంలేదు అని అంటున్నారు. మరో వైపు కాకినాడ ఎంపీ వంగా గీత కూడా పిఠాపురంలో పట్టు సాధించారు. ఆమెతో ఎమ్మెల్యేలు పడదని అంటారు. ఇక ఆయన మీద అనేక రకాలైన ఫిర్యాదులు అధినాయకత్వానికి వెళ్ళాయని చెబుతున్నారు.

ఆ విషయం ఆయనకు కూడా తెలుసు అని అంటున్నారు. ఇలా పెర్ఫార్మెన్స్ తో పాటు ఫిర్యాదులు పార్టీ గ్రాఫ్ పెరగకపోవడం ఇలాంటి అనేక కారణాల వల్ల వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకు దక్కపోతే ప్లాన్ బీని ఈ ఎమ్మెల్యే రెడీ చేసి పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు.  దొరబాబు బావమరిది అయిన కర్నాటక  కర్ణాటక యువజన కాంగ్రెస్ నాయకుడు  రక్షా రామయ్య ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ణి కలసి కీలక విషయాలు మాట్లాడారని అంటున్నారు. అందులో తన బావ దొరబాబుకు వైసీపీ టికెట్ నిరాకరిస్తే ఆయనకు జనసేనలో టికెట్ ఇవ్వాలని కోరినట్లుగా పార్టీలో  గుసగుసలు వినిపిస్తున్నాయి.

అంటే ఈ సీటు విషయంలో ముందే జనసేన నుంచి బెర్త్ కన్ ఫర్మ్ చేయించుకునేలా దొరబాబు పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఇక పిఠాపురం సీట్లో జనసేనకు 2019 ఎన్నికల్లో 28 వెలా దాకా ఓట్లు వచ్చాయి. అప్పట్లో ఈ సీటు నుంచి మాకినీడి శేషుకుమారి పోటీ చేశారు. ఇక 2004లో చూస్తే ఇదే పెండెం దొరబాబు బీజేపీ తరఫున పోటీ చేసి ఫస్ట్ టైం గెలిచారు. దాంతో ఆయనకు పిఠాపురం బీజేపీ నేతలతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయని చెబుతున్నారు. జనసేన బీజేపీ పొత్తు ఉంటుంది కాబట్టి పవన్ పార్టీ నుంచి తాను బరిలో ఉంటే అన్ని రకాలుగా లాభం ఉంటుందని దొరబాబు పొలిటికల్ స్కెచ్ వేస్తున్నారు అని ప్రచారం సాస్గుతోంది.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే జనసేనకు మంచి బలం ఉన్న ఈ సీటు మీద పవన్ కన్ను కూడా ఉంది అంటున్నారు. ఆయన కనుక పోటీ చేస్తే దొరబాబుకు సీటు లేనట్లే. ఒకవేళ దొరబాబు లక్ బాగుండి పవన్ వేర చోటకు వెళ్తేనే పిఠాపురం టికెట్ దక్కేది అంటున్నారు. మొత్తానికి పక్కాగా ప్లాన్ వేసుకున్నా వచ్చే ఎన్నికల్లో దొరబాబుకు టికెట్ దక్కుతుందా దక్కితే ఏ పార్టీ నుంచి దక్కుతుంది. ఆయన మళ్ళీ గెలిచి అసెంబ్లీలోకి వస్తారా అంటే ఇవన్నీ ఈ రోజుకి కూడా ఎవరికీ జవాబు తెలియని ప్రశ్నలే అంటున్నారు. మొత్తానికి జగన్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే జారిపోతాడన్న గుసగుసలు మాత్రం వైసీపీలో చర్చకు తావిస్తున్నాయి.  మరి అది నిజమా కాదా అసలు ఏం జరుగుతోంది అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News