ఆరుగురు ఏపీ మంత్రులు హైదరాబాద్ లో ఇళ్లు కొనటమా?

Update: 2021-12-06 04:55 GMT
ఏపీ..తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడో అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి చెందిన ఆరుగురు మంత్రులు హైదరాబాద్ లో ఇళ్లు కొంటున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన డీల్ ఇప్పటికే పూర్తి అయినట్లు చెబుతున్నారు. విపక్ష నేత చంద్రబాబు.. హైదరాబాద్ లోని ఇంటిని మరమ్మతులు చేసి నిర్మించుకోవటం.. ఏపీ రాజధానిగా ఆయన డిసైడ్ చేసిన అమరావతిలో ఇల్లు లేకపోవటాన్ని పలువురు వేలెత్తి చూపటం తెలిసిందే. విపక్ష నేతగా ఉన్న వేళలోనే.. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నివాసాన్ని ఏపీలో ఏర్పాటు చేసుకోవటం తెలిసిందే. అందుకు భిన్నంగా చంద్రబాబు మాత్రం హైదరాబాద్ ఇంటిని రెన్నోవేట్ చేసుకున్నారే కానీ.. ఏపీలో మాత్రం కట్టుకోపోవటం పలు విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికి ఆయన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

చంద్రబాబు విషయంలో ఏ అంశాన్ని అయితే.. వేలెత్తి చూపించారో.. ఇప్పుడు ఏపీకి చెందిన ఆరుగురు మంత్రులు ఇళ్లను హైదరాబాద్ లో కొనుగోలు చేస్తున్న వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎవరెన్ని చెప్పినా..సామాన్యులు మొదలు సంపన్నుల వరకు ఏపీకి చెందిన మూడు కుటుంబాల్లో ఒక ఫ్యామిలీకి హైదరాబాద్ లో లింకు ఉందన్న విషయం తెలిసిందే. అక్కడా.. ఇక్కడా ఇంటిని ఏర్పాటు చేసుకోవటం గడిచిన ఏడేళ్లలో ఎక్కువైంది. ఎందుకంటే.. హైదరాబాద్ ఐటీ హబ్ గా మారటం.. రానున్న రోజుల్లోనూ హైదరాబాద్ లోనే కెరీర్ ఆప్షన్లు వెతుక్కోవటం ఎక్కువ అయ్యే నేపథ్యంలో ఇక్కడే ఇంటిని ఏర్పాటు చేసుకోవాలన్నది ఎక్కువైంది.

సామాన్యుల సంగతే ఇలా ఉంటే.. ఏపీ మంత్రులుగా ఉండే వారికి మాత్రం.. హైదరాబాద్ లో ఆస్తుల్ని ఏర్పాటు చేసుకోవటం తప్పనిసరి అన్న భావన ఎక్కువైందంటున్నారు. గడిచిన ఏడేళ్లను గమనిస్తే..ఏపీ రియాల్టీ రంగం అంతకంతకూ తిరోగమనం బాట పడితే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా పురోగతి భాట పడుతోంది. దీంతో.. హైదరాబాద్ లో తమ స్థాయికి తగ్గట్లు ఇంటిని ఏర్పాటు చేసుకోవటం అవసరమన్న వాదన ఎక్కువైంది. ఇందుకు ఏపీ మంత్రులు సైతం మినహాయింపు కాదంటున్నారు. తాము చేసే వ్యాపారాలకు.. ఇతర అవసరాలకు హైదరాబాద్ లో ఒక ఇంటి అవసరాన్ని గుర్తించిన వారు.. ఇప్పుడు ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అయితే.. అనుకోని రీతిలో ఒకేసారి ఆరుగురు మంత్రులు.. హైదరాబాద్ లో కొత్తింటిని ఏర్పాటు చేసుకోవటం.. ప్లానింగ్ చేసింది కాదని..అలా అనుకోకుండా జరిగిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మంత్రులుగా ఉండి వెనకేసుకున్న మొత్తాన్ని ఏపీలో ఆస్తుల రూపంలో కొంటే ఇబ్బంది ఏర్పడుతుందన్న ఉద్దేశంతో.. హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఏపీ మంత్రులు ఏర్పాటు చేసుకుంటున్నారని చెబుతున్న ఆరు ఇళ్ల అంశం పంచాయితీగా మారే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో కాలమే సరైన సమాధానం ఇస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News