గంట వదిలిపెట్టండి.. రూ.కోటి ఇస్తా.. వాడిని వేసేస్తా!

Update: 2021-04-17 04:30 GMT
ప్రశాంతతకు మారుపేరుగా చెప్పే విశాఖలో ఊహించని ఆరాచకం చోటు చేసుకోవటం.. తన కుమార్తె విషయంలో ఒక కుటుంబం వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని పెంచుకున్న అప్పలరాజు.. మానవత్వం మరిచి ఏకకాలంలో ఆరుగురిని కత్తితో అత్యంత దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంలో షాకింగ్ నిజం బయటకు వచ్చింది.

తన కుమార్తెను మాయమాటలు చెప్పి లొంగదీసుకోవటంతో పాటు.. పెళ్లి కాకుండా అడ్డుపడుతున్నారన్న ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తున్న నిందితుడు అప్పలరాజు.. పోలీస్ స్టేషన్ లో పోలీసులకు భారీ షాకిచ్చాడని చెబుతున్నాడు. అతడి టార్గెట్ అయిన విజయ్ కిరణ్.. తాజాగా వచ్చాడని తెలుసుకున్న అతడు.. తనను గంట పాటు వదిలేస్తే.. అతడ్ని కూడా ఏసేస్తానని.. ఆ తర్వాత వచ్చి లొంగిపోతానని.. అందుకు ప్రతిఫలంగా రూ.కోటి ఇస్తానని ఆఫర్ ప్రకటించినట్లు చెబుతున్నారు.

కొన్నేళ్ల క్రితం తన కుమార్తెను అక్రమంగా లొంగదీసుకున్నారంటూ కేసు పెట్టటంతో పాటు.. తీవ్రంగా ఉడికిపోతున్న అప్పలరాజు.. తాజాగా విజయ కిరణ్ కుటుంబ సభ్యులు జుత్తాడ (పెందుర్తి మండలం) రావటం.. వారిని చూసిన వెంటనే కట్టలు తెగిన ఆగ్రహంతో చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరిని దారుణంగా నరికేసి చంపేయటం తెలిసిందే.

తన వారిని పోగొట్టుకున్న విజయ్ కిరణ్ ఊరికి వచ్చాడని తెలిసిన అప్పలరాజు పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఆవేశానికి గురైనట్లు చెబుతున్నారు. తన కుమార్తెకు పెళ్లి కాకుండా అడ్డంపడుతున్న విజయ్ కిరణ్ కుటుంబంలో ఎవరిని వదిలిపెట్టనని చెబుతున్న అతడు.. ఇప్పటికే ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపేయటం తెలిసిందే. అయితే.. విజయ్ కిరణ్ ఊరికి రాకపోవటంతో తప్పించుకున్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అతడు.. విజయ్ కిరణ్ వచ్చాడని తెలియగానే.. తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడని.. ఆడపిల్ల తండ్రిగా తనకు ఆవేదనను మిగిల్చారన్న కసి ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
Tags:    

Similar News