ముగ్గురు 'కమలమ్మ'లతో మహా ఇరకాటం

Update: 2015-06-25 04:51 GMT
ఒకే రోజు మూడు ఆరోపణలు. మూడు.. ఉక్కిరిబిక్కిరి చేసేవి కావటం కమలనాథుల్ని కంగారు పెట్టేస్తుంది. బీజేపీకి చెందిన ముగ్గురు మహిళా నేతలకు చెందిన వివాదాస్పద అంశాలు తెరపైకి రావటంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఏడాదిగా ఎలాంటి ఆరోపణలు లేకుండా బండి లాగించిన మోడీ సర్కారు..గత రెండు వారాలుగా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతోంది. స్మృతి ఇరానీ విద్యార్హతకు సంబంధించిన వివాదం పాతదే అయినా.. ఐపీఎల్‌ మాజీ బాస్‌ లలిత్‌ మోడీకి వీసా సాయానికి సంబంధించి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ వ్యవహారం తెర మీదకు రావటతో రచ్చ మొదలైంది.

బుధవారం చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. లలిత్‌ మోడీ వ్యవహారంలో సుష్మా ఇష్యూ ఆగిపోగా.. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజె పాత్రను నిరూపిస్తూ కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. అదే విధంగా స్మృతి ఇరానీ విద్యార్హతకు సంబంధించి కోర్టులో కేంద్రమంత్రికి ఎదురుదెబ్బ తగలలగా.. మరోవైపు.. మహారాష్ట్ర మంత్రి.. దివంగత గోపీనాథ్‌ ముండే కుమార్తె పంకజ్‌ ముండేకి సంబంధం ఉందని ఆరోపిస్తూ సరికొత్త కుంభకోణం బయటకు వచ్చింది.

ఒకేరోజు ముగ్గురు బీజేపీ మహిళా నేతలకు సంబంధించి అంశాలు అధికారపార్టీకి ఎంతగా ఇబ్బంది పెట్టాయో చూస్తే..

స్మృతి ఇరానీ; తన విద్యార్హతలపై కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి స్మృతి ఇరానీ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన ఫిర్యాదును ఢిల్లీ న్యాయస్థానం పరిశీలనకు తీసుకుంది. దీంతో.. ఈ అంశంపై కేంద్రమంత్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లోక్‌సభ.. రాజ్యసభకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో వేర్వేరు విద్యార్హతలు సమర్పించారన్న ఆరోపణపై దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు విచారణకు అంగీకరించింది. దీనిపై తదుపరి విచారణ ప్రక్రియను ఆగస్గు 28కి కోర్టు వాయిదా వేసింది.

వసుంధర రాజె; ఐపీఎల్‌ మాజీ బాస్‌ లలిత్‌ మోడీకి సంబంధించి వీసా విషయంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజె పాత్ర ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా ఆమె సంతకంతో ఉన్నదిగా చెబుతున్న ఒక పత్రం విడుదలైంది. లలిత్‌ మోడీ ఇమ్మిగ్రేషన్‌ అప్లికేషన్‌ మీద రాజస్థాన్‌ ముఖ్యమంత్రి సంతకంతో కూడిన పత్రాన్ని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రిగా ఉండటానికి ఒక్క క్షణం కూడా అర్హత లేదని..వెనువెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. లలిత్‌ మోడీకి వీసా జారీకి సంబంధించిన పత్రాల్లో వసుంధర రాజె సంతకం ఇప్పుడు ఆమెకు ఇబ్బందికరంగా మారింది. అలాంటిదేమీ చేయలేదని వసుంధర.. బీజేపీ నేతలు వాదించిన సమయంలోనే తాజాగా ఆమె సంతకంతో కూడిన పత్రంగా చెబుతున్నది విడుదల కావటం.. కమలనాథుల్ని కంగారెత్తిస్తోంది.

పంకజ్‌ ముండే; కేవలం ఒక్కరోజు వ్యవధిలో చిన్నపిల్లలకు అల్పాహారం కోసం రూ.114.27కోట్ల విలువైన వేరుశనగ చిక్కీల కొనుగోలుకు ఎలాంటి టెండర్లు లేకుండానే అనుమతులు ఇచ్చేసిన మహారాష్ట్ర మంత్రి వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.నిబంధనల ప్రకారం రూ.3లక్షలకు మించి కొనుగోలు చేసే ఏ అంశానికైనా ఈ టెండర్ల ద్వారా నిర్వహించాలి. అందుకు భిన్నంగా ఎలాంటి ఈ టెండర్‌ ప్రక్రియ లేకుండానే ఏకంగా రూ.114కోట్ల వేరుశనక.. బెల్లం పాకంతో తయారు చేసిన చిక్కీని కొనుగోలుకు సంబంధించిన అనుమతుల అంశం బయటకు వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్‌ స్పందిస్తూ.. ఈ ఆరోపణలకు సంబంధించి ప్రాధమికంగా ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు.

Tags:    

Similar News