ఆ హీరో సూసైడ్ కు ముందు నాతో మాట్లాడి ఉంటే..!

Update: 2023-03-26 10:20 GMT
క‌ళారంగంలో ఒడిదుడుకుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం చాలా ముఖ్యం. అవ‌కాశాలు ఉన్నా లేక‌పోయినా ఈ రంగంలో మ‌నుగ‌డ సాగించాలి. ఒక‌సారి రంగుల ప్ర‌పంచంలో అడుగుపెట్టాక వారియ‌ర్ లా ప‌ని చేయాల్సి ఉంటుంది. ప‌డుతూ లేస్తూ గెలుస్తూ ఓడుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది. కానీ కొంద‌రు బ‌ల‌హీనులు మాత్ర‌మే అనుకున్న‌ది సాధించ‌లేక నిల‌దొక్కుకోలేక‌ ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డే స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఇదే కోవ‌లో టాలీవుడ్ లో యువ‌హీరో ఉద‌య్ కిర‌ణ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. కెరీర్ ప‌రంగా అవ‌కాశాల్లేక అవ‌కాశాల‌ను సృష్టించుకోలేక‌.. కుటుంబంలో ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఉద‌య్ కిర‌ణ్ స‌త‌మ‌త‌మ‌య్యాడ‌ని అప్ప‌ట్లో క‌థ‌నాలొచ్చాయి. ఉద‌య్ త‌ర‌హాలో ప‌లువురు న‌టీన‌టులు రంగుల ప్ర‌పంచంలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న సంద‌ర్భాలున్నాయి. ఉద‌య్ కిర‌ణ్ త‌ర్వాత బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం అతిపెద్ద‌ సంచ‌ల‌న‌మైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అత‌డి అభిమానులు ఆ ఘ‌ట‌న‌ను జీర్ణించుకోలేక‌పోయారు.

ఇప్ప‌టికీ సుశాంత్ సింగ్ మ‌ర‌ణం మిస్ట‌రీని ఛేధించ‌డంలో దర్యాప్తు సంస్థ‌లు విఫ‌ల‌మ‌య్యాయ‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక‌పోతే సుశాంత్ సింగ్ మ‌ర‌ణానికి ముందు త‌న‌తో మాట్లాడాన‌ని ప్ర‌ముఖ న‌టి.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. ఈ విష‌యంపై స్మృతి తాజా ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. ``సుశాంత్ చనిపోయిన రోజు నేను VC (వీడియో కాన్ఫరెన్స్)లో ఉన్నాను. చాలా మంది ఈ స‌మావేశంలో ఉన్నారు. నేను దానిని ఆపలేని ప‌రిస్థితి .. అయినా నేను దానిని ఆపాను. నాకు అనిపించింది.. అతడు నాకు ఎందుకు కాల్ చేయ‌లేదు? అత‌డు ఒకసారి కాల్ చేసి ఉండాల్సింది. నేను ఆ అబ్బాయితో చెప్పాను. ``తుమ్ యార్ మర్నా మత్ అప్నే ఆప్ కో (దయచేసి మిమ్మల్ని మీరు చంపుకోకండి)`` అని తాజా ఇంట‌ర్వ్యూలో స్మృతి వెల్ల‌డించారు. `ది స్లో` అనే మ్యాగ‌జైన్ ఇంటర్వ్యూలో హోస్ట్ నీలేష్ మిశ్రాకు ఈ విషయాన్ని చెబుతూ ఇరానీ ఉద్వేగానికి లోనయ్యారు.

అంతేకాదు మ‌రో ప్ర‌తిభావంత‌మైన న‌టుడు అమిత్ సాద్ కెరీర్ అభ‌ద్రత అత‌డి ఆలోచ‌న‌లపైనా స్మృతి ఇరానీ తాజా ఇంట‌ర్వ్యూలో ఆందోళన చెందారు. అతను కూడా `మూర్ఖత్వం`తో ఏదైనా చేస్తాడని భ‌య‌ప‌డ్డాన‌ని కూడా అన్నారు. ``తక్షణమే.. అమిత్ సాద్ విష‌యంలోను ముందే నేను భయపడ్డాను. నేను అతడికి కాల్ చేసి ఏం చేస్తున్నాడో అడిగాను. నాకు తెలుసు.. కుచ్ గద్బద్ కరేగా బచ్చా (అతను ఏదో తెలివితక్కువ పని చేస్తాడు). ఉస్నే ముఝే కహా.. ముఝే నహీ రెహ్నా.. క్యా కియా ఇస్ ఇడియట్ నే (అతను నాకు బతకాలని లేదా.. మూర్ఖుడు ఏం చేసాడు?) నాకు ఏదో తప్పు జరుగుతుందని అర్థమైంది. ప‌బ్లిసిస్ట్ రోహిణి అయ్యర్ నాకు ముందే చెప్పారు..``నేను చాలా భయపడుతున్నాను.. ఎవరైనా అతడి సంగ‌తి ఏమిటో క‌నుక్కోండి`` అని అన్నారని తెలిపారు.  బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - అమిత్ సాద్ ఇద్ద‌రూ `కై పో చే`లో కలిసి పనిచేశారు. అయితే కెరీర్ ప‌రంగా విసిగిపోయిన అమిత్ సాద్ నాలుగు సార్లు ఆత్మ‌హ‌త్యా య‌త్నం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని ఒక ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. కానీ అత‌డు ఆ త‌ప్పు చేయ‌కుండా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇప్పుడు అత‌డు బాలీవుడ్ లో స్టార్ యాక్ట‌ర్.

నిజానికి అమిత్ సాద్ ని స్మృతి ఇరానీ క‌న్విన్స్ చేయ‌గ‌లిగారు. అది ప్ర‌మాదాన్ని ఆపింది. ఇద్దరూ రెండు గంటల పాటు మాట్లాడుకున్నారు. ``నీకు న‌టుడిగా అవ‌కాశాల్లేవా? నేను ఏదో ఒక‌టి చేస్తాను.. మాట్లాడుకుందాం`` అని చెప్పాన‌ని స్మృతి అన్నారు. సీనియ‌ర్ న‌టి నుంచి కాల్ వ‌చ్చిన విష‌యంపై అమిత్ సాద్ గతంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ``నేను చాలా కృతజ్ఞుడిని. నేను ఈ పేరు ఎప్పుడూ చెప్ప‌లేదు. నేను ఇబ్బందుల్లో ఉన్నానని న‌టి స్మృతి ఇరానీ గుర్తించారు. నాకు త‌న‌ నుండి యాధృచ్ఛికంగా కాల్ వచ్చింది. ఆమె నాకు సోదరి లాంటివారు. ఆమె న‌న్ను కెరీర్ గురించి అడిగారు. రెండు గంట‌లు పైగా మాట్లాడుకున్నాం. నేను పరిశ్రమ నుండి వైదొలగడం గురించి  చెప్పాను. నేను విసిగిపోయాను.. పరిశ్రమ కఠినమైనది. నిరాశాజనకం.. కోవిడ్ కూడా ఇందులో పెద్ద‌ పాత్ర పోషించింది. 3 నెలల పాటు నేను కొండలలో ఉండిపోయాను!`` అని అతడు చెప్పాడు.

నిజానికి స్మృతి ఇరానీ సుశాంత్ సింగ్ స‌హా ఎంద‌రో న‌టీన‌టుల క‌ష్ట న‌ష్టాల‌ను అడిగి తెలుసుకునేవారు. ముంబైలో తన పక్కనే ఉన్న సెట్స్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ‌ర్క్ యాటిట్యూడ్ ని ద‌గ్గ‌ర‌గా చూసి అభిమానించార‌ట‌. ఆమె I&B మంత్రిగా ఉన్నప్పుడు శేఖర్ కపూర్ తో కలిసి IFFI స్టేజ్ లో మాస్టర్ క్లాస్ కు సుశాంత్ సింగ్ ని ఆహ్వానించారు.

Similar News