మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ గంగిరెడ్డి ఇతడా?

Update: 2015-11-16 03:56 GMT
ప్రపంచంలోని పలు దేశాల స్మగ్లర్లతో సంబంధాలు. ఏపీలోని ఎర్రచందనం మాఫియాకు డాన్ గా పేరొంది.. పలు హత్య కేసులతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా పేరొంది.. పోలీసులకు ఏ మాత్రం కొరుకుడు పడకుండా తప్పించుకు తిరుగుతున్న గంగిరెడ్డి ఎలా ఉంటాడు? ఎంత యాక్టివ్ గా ఉంటాడు? ఎంత హుషారు ఉంటే ఇంతలా తప్పించుకోగలడన్న మాటలు వినిపించాయి. కానీ.. ఏపీ పోలీసులు గంగిరెడ్డిని మీడియా ముందు ప్రవేశ పెట్టినప్పుడు చిన్నపాటి విస్మయం.

నెరిసిపోయిన జట్టు.. మీద పడిన వయసుతో.. చాలా మర్యాదగా.. పక్కింటి పెద్ద మనిషిలా కనిపించి.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చాలా జాగ్రత్తగా సమాధానాలు చెబుతూ.. మొత్తం భారాన్ని దేవుడి మీద వేస్తూ చెప్పిన మాటలు విన్న వారికి ఒకింత విస్మయం కలగక మానదు. చూసేందుకు పుట్టెడు రోగాల పుట్టగా.. చాలా నెమ్మదిగా వ్యవహరించే ఇతగాడు అన్ని దారుణ నేరాలు చేశాడా? అన్న సందేహం కలిగేలా ఉండటం గమనార్హం.

ఇక.. మీడియావేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. తన అదృష్టం బాగాలేక పోలీసులకు దొరికినట్లు చెప్పిన అతగాడు.. ఎర్ర చందనం స్మగ్లింగ్ కోసం విదేశాలకు వెళ్లలేదని.. మినరల్స్ వ్యాపారం చేసేందుకే ఫారిన్ వెళ్లినట్లుగా చెప్పుకొచ్చాడు. తాను ఎక్కడికి పారిపోలేదని చెప్పిన అతడ్ని.. మరి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే.. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసి ఉండొచ్చని వ్యాఖ్యానించాడు.

స్మగ్లింగ్ కోసం ఫారిన్ వెళ్లలేదని.. మినరల్స్ వ్యాపారం కోసం తాను దుబాయ్ వెళ్లినట్లు చెప్పిన గంగిరెడ్డిని.. ఏ వ్యాపారం చేసి రూ.400కోట్ల ఆస్తి పోగేశారు (విలేకరుల సమావేశంలోఏపీ డీజీపీ రాముడు మాట్లాడుతూ గంగిరెడ్డి ఆస్తి రూ.400కోట్ల వరకూ ఉండొచ్చని చెప్పారు) అని ప్రశ్నిస్తే.. తనకు తెలియని విషయాలు అడిగితే తానేం సమాధానం చెప్పేదంటూ గంగిరెడ్డి సమాధానమిచ్చాడు.

తాను ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నానో తనకే తెలీదని.. తన టైం బాగోలేక ఇలా అయ్యిందంటూ రెండు చేతులెత్తి దండం పెట్టేశాడు. తాను చేసిన పనులకు దేవుడు సహకరించాడంటూ కనిపించని దేవుడ్ని సీన్లోకి తీసుకొచ్చాడు. గంగిరెడ్డికి ఏపీ సర్కారు నుంచి ప్రాణహాని ఉందన్న వాదనల్ని గంగిరెడ్డిని అడిగితే.. తనకు ఎవరి నుంచి ప్రాణహాని ఉందని అనుకోవటం లేదని వ్యాఖ్యానించాడు. గంగిరెడ్డి మాటల్ని విన్న వారంతా.. ఇతనేనా అంత పేరు మోసిన స్మగ్లర్ గంగిరెడ్డి అన్న వ్యాఖ్యలు వినిపించటం గమనార్హం.
Tags:    

Similar News