సీబీఐ కాద‌ట‌.. బీబీఐ అన్న‌ మ‌మ‌త‌!

Update: 2018-10-24 10:50 GMT
ఎక్క‌డైనా ఏదైనా అన్యాయం జ‌రిగినా.. మ‌రేదైనా దారుణం చోటు చేసుకున్నా.. స్థానిక పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించొచ్చు. కానీ.. సీబీఐ కానీ రంగంలోకి దిగిందంటే సీన్ మొత్తం మారిపోతుంద‌న్న భావ‌న గ‌తంలో ఉండేది.  కాలంతో పాటు.. సీబీఐ మీద ప్ర‌జ‌ల్లో ఉన్న న‌మ్మ‌కం.. విశ్వ‌స‌నీయ అంత‌కంత‌కూ త‌గ్గే ప‌రిస్థితి. ఇక‌.. మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీబీఐని ఇంత‌లా కూడా వాడేయొచ్చా? అన్న విమ‌ర్శ‌లు బాహాటంగా చేసే వ‌ర‌కూ సీబీఐ వ్య‌వ‌హార‌శైలి ఉంద‌న్న‌మాట బ‌లంగా వినిపిస్తోంది.

ప‌వ‌ర్ కు అనుగుణంగా కీల‌క ద‌ర్యాప్తు సంస్థ‌లు వ్య‌వ‌హ‌రించ‌టం గ‌తంలో ఉన్న‌ప్ప‌టికీ.. అంతో ఇంతో స్వ‌తంత్య్రంగా వ్య‌వ‌హ‌రించేవి. కానీ.. మోడీ పుణ్య‌మా అని అలాంటిదేమీ క‌నిపించ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌న్న మాట అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. సీబీఐ అన్నంత‌నే అలెర్ట్ కావ‌టం..ద‌ర్యాప్తులో లోపాల్ని ఇట్టే ప‌ట్టేసే హీరోయిజం దాని సొంత‌మ‌న్న‌ట్లుగా ఒక‌ప్పుడు ఇమేజ్ ఉండేది.

తాజాగా ఈ సంస్థ‌లో చోటు చేసుకున్న అంత‌ర్గ‌త లొల్లి షాకింగ్ గా మాత్ర‌మే కాదు సంచ‌ల‌నంగా మారింది. సీబీఐలోని ఉన్న‌తాధికారుల లంచాల బాగోతం యావ‌త్ దేశాన్ని ఆశ్చ‌ర్యానికి గుర‌య్యేలా చేసింది. అంద‌రి అవినీతి మీద ద‌ర్యాప్తు చేయాల్సిన విచార‌ణ అధికారులే త‌మ‌కు తాము అవినీతిలోకి కూరుకుపోతే ఇంకేం చేయాల‌న్న ప్ర‌శ్న త‌లెత్తేలా చేసింది.

దొంగ‌ల మీద‌.. ఘ‌రానా మోసాలు చేసే వారిపై కేసులు పెట్టే సీబీఐ.. చివ‌ర‌కు త‌న స్పెష‌ల్ డైరెక్ట‌ర్ పైనే కేసులు పెట్టే వ‌ర‌కూ వెళ్ల‌టంతో ఈ సంస్థ తీరుపై ఆందోళ‌న‌లు.. అఉమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అవినీతి అధికారుల్ని అరెస్ట్ చేయాల్సిన సీబీఐ అధికారులు చివ‌ర‌కు త‌మ సంస్థ‌కు చెందిన డీఎస్పీ స్థాయి వ్య‌క్తిని అరెస్ట్ చేసిన తీరు చూస్తే.. సీబీఐకి ఏమైంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారిన ప‌రిస్థితి.

అవినీతి ఆరోప‌ణ‌ల పంకిలంలోకి చిక్కుకున్న సీబీఐ.. తాజాగా దేశంలోనే అత్యున్న‌త గూఢాచార సంస్త రాను.. ఈడీని త‌న లంచాల మ‌ర‌క‌ను వేయ‌టంతో ఇప్పుడు ఎవ‌రిని విశ్వాసంలోకి తీసుకోవాల‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇలాంటి వేళ‌.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మోడీ స‌ర్కారు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. సీబీఐ కాస్తా ఇప్పుడు బీబీఐగా మారింద‌న్నారు. తాను చెప్పిన బీబీఐ అంటే.. బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ గా మారిపోయింద‌ని ఘాటు విమ‌ర్శ చేశారు. ట్విట్ట‌ర్ లో త‌న మెసేజ్ ను పోస్ట్ చేశారు మ‌మ‌త‌. ఆమె ట్వీట్‌కు త‌గ్గ‌ట్లే.. సీబీఐలో తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  


Tags:    

Similar News