ఐటీని వీడుతున్న ఇంజినీర్లు..కారణం ఇదే..

Update: 2018-07-04 07:08 GMT
సరిగ్గా 5 రోజుల క్రితం.. 29 జూన్.. మాదాపూర్ లోని మీలాంజ్ టవర్ లోని ఓ ప్రైవేట్ సాఫ్ట్ వేర్ కంపెనీ.. ఎప్పటిలాగానే ఆఫీసుకు వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్రావణి 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రావణి మదీనాగూడలో భర్తతో కలిసి ఉంటుంది. ఈమెకు ఓ కొడుకు కూడా.. మానసిక ఒత్తిడియే ఆమె మరణానికి కారణంగా పోలీసులు - కుటుంబసభ్యులు తేల్చారు. శ్రావణి ఒక్కదానిదే ఈ సమస్య కాదు.. ప్రస్తుతం హైదరాబాద్ - బెంగళూరు సహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో జాబు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు పని ఒత్తిడి తట్టుకోలేక నెలకు కనీసం ఐదుగురు అయినా ఆత్మహత్య చేసుకుంటున్నారని తాజా సర్వేలో తేలింది.. సాఫ్ట్ వేర్ల మరణ మృందంగానికి పని ఒత్తిడి - లక్ష్యాలు చేరకపోవడం..కాలంతో పరుగులు తీయకపోవడమే కారణమని తెలిసింది.

పని ఒత్తిడి ప్రాణాలు తీస్తోంది. ఈ ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో కాలంతో పోటీపడే జాబ్ అంటే సాఫ్ట్ వేర్ జాబే.. ఒకప్పుడు నెలకు లక్ష జీతం ఇస్తున్న సాఫ్ట్ వేర్ కొలువు అంటే అందరూ ఆశపడేవారు. కానీ ఇప్పుడు సాఫ్ట్ వేర్ కొలువులు చేయలేక పల్లెలకు పోయి వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలా మంది ఇంత ఒత్తిడి భరించలేమని తప్పుకుంటున్నారు. ఇది ఇక్కడే కాదు.. అమెరికాలోనూ ఇలాంటి పరిస్థితి ఉంది.

 ట్రంప్ ప్రభుత్వం అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ కఠిన నిబంధనలు పెట్టడంతో భారతీయ - విదేశీ - అమెరికన్ కంపెనీలన్నీ అమెరికాలో చదువుతున్న ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి 6 నెలలు శిక్షణ ఇస్తున్నాయట.. ఆ తర్వాత జాబ్ లోకి తీసుకుంటే ఎవరూ సంవత్సరం కూడా పనిచేయకుండా రిజైన్ చేసి వెళ్లిపోతున్నారు. ఇంతటి ఒత్తిడి తాము తట్టుకోలేమంటూ ఉద్యోగాలు వదిలేస్తుండడంతో అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల కొరత ఇప్పుడు వెంటాడుతోంది.

ఇండియాలో మన వాళ్లు ఒత్తిడికి తలొగ్గి పనులు చేస్తున్నా వారి సంసార - వ్యక్తిగత జీవితాలు మాత్రం ఈ జాబ్ తో చెల్లచెదురవుతున్నాయి. పని ఒత్తిడితో కుటుంబాల్లో గొడవలు పెట్టుకోవడం.. సంసారాలను పట్టించుకోకపోవడంతో చాలామంది ఐటీ నిపుణుల జీవితాలు నాశనమవుతున్నాయని  సర్వేలో తేలింది. ఇంత ఒత్తిడి మధ్య పనిచేయలేక చాలా మంది 40 ఏళ్లుకాగానే సంపాదించిన దాంతో గ్రామాలకు వచ్చేసి వ్యవసాయం లేదా ఏదైనా వినూత్న పరిశ్రమను పెట్టుకొని ప్రత్యామ్మాయ ఉపాధిని పొందుతున్నారు. ఇప్పుడీ ఒరవడి సాఫ్ట్ వేర్ పరిశ్రమలో చోటుచేసుకుంది.

లక్షల జీతాల కన్నా.. లక్షణమైన జీవితం చాలనే భావన ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్లలో నెలకొంది. ఇంత ఒత్తిడి మధ్య పనిచేయలేని చాలా మంది తనువు చాలిస్తుండగా.. కొందరు మాత్రం ఆర్థిక ఇబ్బందులు - కుటుంబ పోషణ కోసం చేస్తున్నారు. కానీ ఈ రాత్రి - పగలు తేడా లేని కొలువుల వల్ల తమ వ్యక్తి గత జీవితాలను కోల్పోతున్నారు. ఇటు సంసారం సరిగ్గా చేయలేక.. అటు హైఎండ్ పని ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది నరకయాతన పడుతున్నారు. అందుకే 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఎవ్వరూ చేయడానికి ఇష్టపడడం లేదని తాజా సర్వే ఒకటి తేల్చింది.

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కట్ట శ్రీనివాస్ హైదరాబాద్ లో ఎంబీఏ చదివి ముంబైలోని సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు. మంచి ఉద్యోగమే అయినా ఆ ఒత్తిడి తట్టుకోలేక నిత్యం నరకం అనుభవించాడు. ముంబైలో లక్షలు వస్తున్నా కూడా వదిలేసి వ్యవసాయం చేసేందుకు సొంతూరుకు వచ్చాడు.  ఇక్కడకు రాగానే అధునాతన సాగు పద్ధతులను అన్వేషించాడు. దక్షిణ కొరియా లో చేస్తున్న చౌహన్ క్యూ పద్దతి  వ్యవసాయం అతడిని ఆకర్శించింది.  వాటిని ఇక్కడ అమలు చేసి కూరగాయలు సాగు చేసి కార్పొరేట్ కంపెనీలకు ఆ స్వచ్ఛ మందులు వాడని కూరగాయలు అమ్ముతూ లాభాల పంట పండిస్తున్నాడు.

కరీంనగర్ పూర్వపు జిల్లాలోని గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన సాగర్ రెడ్డి అనే యువకుడు ఇటీవల లక్షల రూపాయల జీతం ఇచ్చే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జాబును వదిలి సొంతూరుకు వచ్చి కుందేళ్ల సాగును చేపట్టాడు. రాజస్థాన్ వెళ్లి అక్కడ కుందేళ్ల ఫామ్ ను చూసి లాభసాటి అని తెలుసుకొని 100 న్యూజిలాండ్ - ఇంగ్లండ్ - తదితర దేశాల మేలు జాతి కుందేళ్లతో వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం అవి 900 కుందేళ్లకు చేరాయి. నెలకు 50 నుంచి 60వేల సంపాదన వస్తోంది.

ఇలా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్ వేర్ కొలువు బంగారం కాదు.. అదో భారంగా మారింది. మానసికంగా కుదేలు చేస్తున్న ఆ నౌకరిని వదిలి సొంత వ్యాపారాలు - వ్యవసాయం వైపు యువ ఇంజనీర్లు అడుగులు వేస్తున్నారు. పని ఒత్తిడి లేని స్వయం ఉపాధి వైపు దృష్టిసారిస్తున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో వస్తున్న ఈ నయా మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Tags:    

Similar News