మోడీ జమిలి జపం...ఫలిస్తుందా?

Update: 2020-12-23 16:30 GMT
ప్రస్తుతం దేశంలోని రాజకీయ నాయకులంతా జమిలి జపం చేస్తున్న సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికలపై మోడీ సర్కార్ సీరియన్ గా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో 2022లో జమిలి ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పలు పార్టీలు సూచిస్తున్నాయి. తాజాగా సీఈసీ సునీల్ అరోరా కూడా జమిలి ఎన్నికల నిర్వహణపై హింట్ ఇవ్వడంతో జమిలి ఎన్నికలపై వస్తున్న ఊహాగానాలకు ఊతం వచ్చింది. జమిలి ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నామని అరోరా చెప్పారు. లా కమిషన్ కూడా జమిలికి జై కొట్టడంతో ప్రాంతీయ పార్టీలన్నీ జమిలిపై సీరియస్ గా ఆలోచన చేస్తున్నాయి. జమిలి ఎన్నికలపై నివేదిక రూపొందించిన లా కమిషన్ అసలు రాజ్యాంగంలో సమాఖ్య స్ఫూర్తి ఎక్కడున్నదని వాదిస్తోంది. అయితే, కొన్ని రాష్ట్రాలు జమిలి ఎన్నికలపై విముఖంగా ఉన్నాయి. జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అవి వాదిస్తున్నాయి. అయితే, సంపూర్ణ సమాఖ్య సూత్రాన్ని మన రాజ్యాంగం ప్రతిపాదించలేదని, ఏక కేంద్ర, కేంద్రీకృత విధానానికే అది మొగ్గు చూపుతోందని1963లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఈ పాయింట్ పై ఫోకస్ చేసిన ప్రధాని మోడీ...రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి జమిలి ఎన్నికలు విఘాతం కలిగిస్తున్నాయన్న వాదనలకు చెక్ పెడుతున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, సీఏఏ బిల్లు, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, నూతన వ్యవసాయ బిల్లులు వంటి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న మోడీ సర్కార్ ఏ క్షణంలోనైనా జమిలి ఎన్నికల సై అనవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏ అంశంపైనైనా సంప్రదింపులు, చర్చలు, ఏకాభిప్రాయ సాధన అన్న కాన్సెప్ట్ లపై నమ్మకం లేని మోడీ సర్కార్...జమిలికి రెడీ అవుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే, రాష్ట్రాల తరపున అన్ని నిర్ణయాలు కేంద్రం తీసుకోవడానికి సాధ్యపడదు. భిన్న భౌగోళిక స్వభావాలు, అస్తిత్వాలు, సంస్కృతులు, ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలు, ప్రత్యేక అవసరాలు ఉన్న రీత్యా రాష్ట్రాలకూ కొన్ని అధికారాలుంటాయి. కాబట్టి రాష్ట్రాలను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదు.

అయితే, ఇటీవల కొన్ని ఆర్డినెన్స్‌లను చట్టాలుగా మార్చేటపుడు సంప్రదింపులు జరపలేదు. వ్యవసాయ చట్టాల ఆమోదం సందర్భంగా ఈ సంప్రదింపులకు విఘాతం కలిగింది. అయితే, నూతన వ్యవసాయ చట్టాల్లో ఉన్న అంశాలు రాష్ట్ర చట్టాల పరిధి లోనివి కనుక రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని అమలు చేయాలి. అయితే, నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాలు సొంతగా చట్టాలు చేశాయి.దీంతో, జమిలి ఎన్నికల విషయంలో కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి తోడు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమపై ఉన్నకేసుల నేపథ్యంలో కేంద్రానికి దాసోహం అన్నారన్నవిమర్శలు వస్తున్నాయి. ఇక, మరికొందరు సీఎంలను కేంద్రంలోని పెద్దలు ఈడీ, ఐటీ సోదాలపేరుతో బెదిరించి తమవైపు తిప్పుకుంటున్నారన్న విమర్శలున్నాయి. దీంతో, మిగిలిన అరకొర సీఎంలు మోడీని వ్యతిరేకించినా పెద్దగా ఉపయోగం లేదన్న వాదన వినిపిస్తోంది. మరి , జమిలిపై కేంద్రం, రాష్ట్రాల నిర్ణయాలు ఏవిధంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News