మంత్రి గారి లాజిక్ కి అర్ధం ఏమిటో

Update: 2017-11-27 03:57 GMT
వైసీపీ అధినేత‌, విప‌క్ష నేత జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు భారీ స్పంద‌న వ‌స్తున్న విష‌యం కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే దీని గురించి పెద్ద‌గా కామెంట్లు చేయొద్ద‌ని సాక్షాత్తూ సీఎం చంద్ర‌బాబే త‌న ప‌రివారానికి అసెంబ్లీ వేదిక‌గానే ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా అడ‌పా ద‌డ‌పా  టీడీపీ పెద్ద‌లు జ‌గ‌న్‌పై కామెంట్లు కుమ్మ‌రిస్తూనే ఉన్నారు. ఇదిలావుంటే, జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో ఆయా ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌లు విశేషంగా హాజ‌ర‌వుతున్నారు. వారివారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌తో ఏక‌రువు పెట్టుకుంటున్నారు. వృద్ధులు త‌మ‌కు పింఛ‌న్లు అంద‌డం లేద‌ని, వైద్యం స‌రిగా అంద‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నారు. మ‌హిళ‌లు త‌మ‌కు డ్వాక్రా రుణాల మాఫీ జ‌ర‌గ‌డం లేద‌ని, ప‌థ‌కాలు ఏవీ కూడా స‌క్ర‌మంగా అంద‌డం లేద‌ని ఫిర్యాదు చేస్తున్నారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా వింటున్న జ‌గ‌న్‌.. సంద‌ర్భానుసారంగా వారికి హామీలు ఇస్తూ.. ముందుకు సాగుతున్నారు.

ఇక‌, విద్యార్థులు కూడా జ‌గ‌న్‌తో మ‌మేక‌మై.. వారి ఉపాధి, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి విష‌యాల‌పై చ‌ర్చిస్తున్నారు. కొంద‌రు ప్ర‌త్యేక హోదా వ‌స్తే.. త‌మ బ‌తుకులు బాగుప‌డ‌తాయ‌ని, ప‌రిశ్ర‌మ‌లు కూడా వ‌స్తాయ‌ని నేరుగా జ‌గ‌న్ చెబుతున్నారు. ప్ర‌త్యేక హాదా తెస్తామంటే.. త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కూడా అంటున్నారు. ఇలా ఒక్కొక్క వ‌ర్గం ఒక్కొక్క స‌మ‌స్య‌పై జ‌గ‌న్‌కు విన్న‌విస్తోంది. అన్ని స‌మ‌స్య‌ల‌ను అంద‌రి విజ్ఞ‌ప్తుల‌ను ఓపిక‌గా వింటున్న జ‌గ‌న్ త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తుంద‌ని హామీ ఇస్తున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ పాద‌యాత్ర సాగుతున్న ప్రాంతాలకు చెందిన రైతులు కూడా ప‌ట్టుబ‌ట్టి జ‌గ‌న్‌ను త‌మ పొలాల్లోకి తీసుకువెళ్లి.. పంట‌ల ప‌రిస్థితిని వివ‌రిస్తున్నారు. నీరంద‌క, క‌ల్తీ పురుగు మందులు, విత్త‌నాల‌తో తాము ప‌డుతున్న ఆవేద‌న‌ను జ‌గ‌న్‌కు ప్ర‌త్య‌క్షంగా వివ‌రిస్తున్నారు.

ఈ ప‌రిణామాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన ప‌నిలేదు. నేత ఎవ‌రైనా.. త‌మ వ‌ద్దకు వ‌స్తే.. క‌ష్టాల్లో ఉన్న‌వారు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు క్యూ క‌డ‌తారు. గ‌తంలో చంద్ర‌బాబు వ‌స్తున్నా మీకోసం యాత్ర చేసిన‌ప్పుడు కూడా ఉల్లి, మిర్చి, ప‌త్తి, పొగాకు రైతులు ఇలానే త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. అదే విధంగా ఇప్పుడు జ‌గ‌న్ వారికి చేరువ‌లో క‌నిపించే స‌రికి స‌మ‌స్య‌లు చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ఆయా రైతుల‌కు కొన్ని హామీలు ఇచ్చారు. అయితే, ఇప్పుడు వీటినే రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి, నెల్లూరుకు చెందిన సీనియ‌ర్ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా రైతుల్లో ఆత్మ‌స్థైర్యం కోల్పోయేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడంటూ కామెంట్లు కుమ్మ‌రించారు. రైతులే వ‌చ్చి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొంటుంటే.. వారిలో ఆత్మ‌స్తైర్యం కోల్పోయేలా జ‌గ‌న్ ఏం చేశాడో? మ‌ంత్రి వ‌ర్యులే సెల‌వివ్వాలి.

`` కొందరు రాజకీయ పార్టీల నాయకులు పాదయాత్రల పేరుతో రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మా ప్ర‌భుత్వం రైతుల సమస్యలు తీర్చేందుకు నిరంత‌రం కృషి చేస్తోంది.  ఎన్ని ఆటంకాలు  వ‌చ్చినా రైతు సంక్షేమాన్ని మాత్రం మ‌ర‌వ‌బోం. జగన్‌ తన పాదయాత్రలో వాస్తవాలను చెప్పాలి`` అని సోమిరెడ్డి అనడం.. విమ‌ర్శ‌కుల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇటీవ‌ల క‌ర్నూలులో పాద‌యా త్ర చేసిన స‌మ‌యంలో జ‌గ‌న్‌ను ప‌ట్టుబ‌ట్టి కొంద‌రు రైతులు పొలాల్లోకి తీసుకువెళ్లి ప‌రిస్థితి వివ‌రించారు. నిజానికి షెడ్యూల్‌లో లేక‌పోయినా జ‌గ‌న్ వారి పొలాల‌ను సంద‌ర్శించి ధైర్యం చెప్పారు. మ‌రి ఇది ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తీయ‌డం ఎలా అవుతుందో మంత్రి వ‌ర్యులే సెల‌వివ్వాల‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఏదైనా విమ‌ర్శ చేసేట‌ప్పుడు నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కూడా సూచిస్తున్నారు.
Tags:    

Similar News