నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా నెల్లూరు జిల్లాను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు జిల్లా పర్యటనకు వచ్చారు. సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనలో ఉండగానే ఆయనకు పొట్టెంపాడు దగ్గర చాతిలో నొప్పి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సీఎం కాన్వాయ్ లో ఉన్న అంబులెన్స్ లో ఆయన్ను నెల్లూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. అరగంట పాటు వైద్యం చేసిన డాక్టర్లు సోమిరెడ్డికి ప్రమాదం లేదని తెలిపారు. దీంతో సీఎం పర్యటనలో ఉన్న టీడీపీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. సోమిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.