జోకేసినా తెలుగు తమ్ముళ్లు తడుముకుంటున్నారు

Update: 2017-02-27 10:07 GMT
పదేళ్ల తర్వాత పవర్ లోకి వచ్చిన వేళ.. అందరికి కాస్త అవకాశం ఇద్దామన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించినట్లుగా చెబుతారు. గతంలో కఠినంగా ఉండటంతో ఎదురైన పరిస్థితుల్ని గుర్తించి.. ఈసారికి చూసీచూడనట్లుగా ఆయన ఉన్నారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. అదే బాబుకు ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా గొప్పలు చెప్పుకునే పార్టీలో.. ఇప్పుడంతా లుకలుకలేనన్న మాట వినిపిస్తోంది. నేతల మధ్య అంతర్గత విబేధాలు పార్టీ మీద పడటంతో.. అవి శ్రుతిమించి రాగాన పడుతున్న వేళ.. పార్టీ అధినేతే స్వయంగా రంగంలోకి దిగిన వైనం ఈ మధ్యన వార్తల్లో చూస్తున్నదే.

జిల్లాల వారీగా నేతల్ని కూర్చోబెట్టి.. సమస్యలకు పరిష్కారం చూపించే కంటే.. మీరేం చేస్తారో తెలీదు.. మీరైతే విభేదాల్ని పక్కన పెట్టి కలిసిపోవాలంతే అంట తేల్చేస్తున్న బాబు తీరుతో తమ్ముళ్లు తలూపటం మినహా మరేం చేయలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. పైకి ఓకే అన్నా.. లోలోపల మాత్రం లుకలుకలు అలానే ఉన్నట్లుగా చెబుతున్నారు. నేతల మధ్య విభేదాలు కానీ తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవంటూ బాబు చెబుతున్న మాటలతో.. పైపైన ప్లాస్టిక్ నవ్వుల్ని తెలుగు తమ్ముళ్లు చిందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. పాలిట్ బ్యూరో సమావేశంలో.. పార్టీలో నెలకొన్న విభేదాల్ని ప్రస్తావించిన చంద్రబాబు.. పార్టీ నేతలంతా కలిసి పని చేయాలని.. విభేదాల్ని పక్కన పెట్టాలన్న విషయాన్ని తాను చెప్పానని.. ఇటీవల నిర్వహించిన విశాఖ.. గుంటూరు.. అనంత నేతలకు తాను క్లియర్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఇందుకు ఉదాహరణగా అక్కడే ఉన్న మంత్రి అయ్యన్నను.. గంటాలను చూపిస్తూ.. ‘‘వారిద్దరికి కూడా గట్టిగా చెప్పాను. దాంతో చేయి చేయి వేసుకొని కలిసి వెళ్లారు’’ అని బాబు వ్యాఖ్యానించగా.. అంతలోనే అందుకున్న ఎమ్మెల్సీ సోమిరెడ్డి కల్పించుకొని.. ‘‘మీ దగ్గర కలిసి ఒకే కార్లో కూర్చొని మరీ వెళ్లారు. ప్రకాశం బ్యారేజీ దాటగానే దిగేసి.. ఎవరి కారులో వారు వెళ్లిపోయారు’’ అనటంతో అందరి నోట నవ్వులు పూయించాయి. అదే సమయంలో జోకేసిన సోమిరెడ్డి మాటలకు సమాధానంగా మంత్రి అయ్యన్న కల్పించుకొని.. లేదు సార్.. కలిసే చేస్తున్నామంటూ అసలు విషయాన్ని చెప్పకుండా కొసరు మాటను కవర్ చేయటం చూస్తే.. జోకులకు సైతం తడుముకుంటున్నారు చూశారా.. అంటూ తమ్ముళ్లు గుసగుసలాడుకోవటం వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News