సోము జోరుకు బ్రేకులు... రీజన్ ఏంటి... ?

Update: 2021-12-02 15:30 GMT
ఆయన బీజేపీకి మూల స్థంభమైన ఆరెస్సెస్ నుంచి వచ్చిన వారు. బీజేపీకి కమిటెడ్ కార్యకర్త. పార్టీకి నిబద్ధతతో పనిచేసే నాయకుడు. అందుకే అధినాయకత్వం ఆయన్ని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసింది. గోదావరి జిల్లాకు చెందిన వారు కావడం, బలమైన సామాజిక వర్గం వారు కావడంతో ఆయనకు పెద్ద పీట వేశారు. మొత్తానికి సోము వీర్రాజు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా అయిపోయారు. ఆయన నాయకత్వంలో ఏపీ బీజేపీ పరుగులు పెడుతుందని ఎవరూ భావించలేదు కానీ ఇంతకంటే బెటర్ పొజిషన్ లోకి వస్తుందని మాత్రం అనుకున్నారు. దానికి తోడు ఏపీ రాజకీయాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న కాపులను బీజేపీ వైపు ఆయన ఆకట్టుకుంటారని కూడా ఊహించారు.

అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేసేలా సోము పెర్ఫార్మెన్స్ ఉందని పార్టీలో చెబుతున్నారు. ముఖ్యంగా హై కమాండ్ ఆయన మీద పెట్టుకున్న ఆశల‌ను వమ్ము చేసేలా సోము వ్యవహార శైలి ఉందని చెబుతున్నారు. ఏపీలో బీజేపీ అద్భుతాలు సృష్టిస్తుందని ఢిల్లీ పెద్దలు కూడా భావించడం లేదు. అదే సమయంలో  ఏపీలో బీజేపీకి కాస్తా జవసత్వాలు కలిగిస్తే వచ్చే ఎన్నికల్లో పొత్తులకు  రాయబేరాలకు బాగా  అవకాశం ఉంటుందన్నది కేంద్ర పెద్దల ఆలోచన. అయితే సోము ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ ఎదగడం మాట దేముడెరుగు అంతవరకూ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు కూడా ఒక్కసారిగా సైడ్ అయిపోయారు.

దానికి కారణం సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలు అని పార్టీలోనే చెబుతున్నారుట. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన నాయకులను సోము నమ్మడం లేదని కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. ఇక పార్టీలో ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ, దగ్గుబాటి పురంధేశ్వరి వంటి లీడర్ల సేవలను కూడా సరైన తీరులో వాడుకోవడం లేదని కూడా ఫిర్యాదులు వెళ్లాయట. వీటిని అన్నీ చూసిన కేంద్ర నాయకత్వం సోముకు గట్టిగానే క్లాస్ తీసుకుందని గుసగుసలు అయితే పార్టీలో ఉన్నాయి.

ఇక సోము వీర్రాజు ఏపీలో టీడీపీని పూర్తిగా శత్రుపక్షంగా చూస్తూ వైసీపీ మీద కాస్తా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు అన్న ఆరోపణలు  కూడా పార్టీ నేతలు ఢిల్లీ నాయకత్వానికి చేశారని అంటున్నారు. అమరావతి రాజధాని మీద రైతులు ఉద్యమిస్తూంటే సోము వీర్రాజు బీజేపీని ఆ దిశగా నడిపించి వారికి మద్దతు ఇవ్వకపోవడం మీద ఈ మధ్య తిరుపతి వచ్చిన అమిత్ షా కూడా కోప్పడ్డారని ప్రచారం అయితే సొంత పార్టీలోనే సాగింది. అదే టైమ్ లో సోము ఒక్కరికే పగ్గాలు అప్పగిస్తే పార్టీ అంగుళం కూడా కదలదని కోర్ కమిటీతో బాగా బిగించారు అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో కోర్ కమిటీ చెప్పినట్లుగానే పార్టీ పనిచేయాలన్నదే హై కమాండ్ హుకుం. మరి సోముకు ఆ విధంగా బ్రేకులు పడిపోయాయనే అంటున్నారు.

అందులో  సోము వీర్రాజు తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి దుగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్, సీఎం రమేష్, సుజనా చౌదరి, జీవిఎల్ నర్శింహరావు, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) మధుకర్, ఎమ్మెల్సీ పీఎన్వీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, రేలంగి శ్రీదేవి ఉన్నారు.  అలాగే,  ప్రత్యేక అహ్వానితులుగా పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పర్యవేక్షకుడు శివప్రకాశ్, కేంద్ర మంత్రి, రాష్ట్ర ఇన్ చార్జి వి మురళీధరన్, సునీల్ ధేవధర్ లు ఉన్నారు.

ఇక రానున్న రోజుల్లో రాష్ట్ర నాయకత్వం విషయంలో ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇలాగే కొనసాగితే పార్టీ ఇంకా అట్టడునకు వెల్లిపోతుంది కాబట్టి కొత్త ఆలోచనలు కూడా హై కమాండ్ చేయవచ్చు అని బీజేపీలోనే అంటున్నారుట.    అదే జరిగితే సోము వీర్రాజు కు పదవీగండం కూడా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. . చూడాలి మరి. ఏది ఏమైనా సోము ఇపుడు బీజేపీలో కార్నర్ అవుతున్నారన్నది ప్రచారం అవుతున్న విషయం
Tags:    

Similar News