సోము : ఈసారి ఇద్దరినీ ఆటాడుకున్నారు!

Update: 2018-02-17 07:59 GMT
భారతీయజనతా పార్టీలో సోము వీర్రాజు ఫైర్ బ్రాండ్. చంద్రబాబునాయుడు బాగోతాల గురించి విపక్షాలు మాట్లాడడం కంటె ఎక్కువగా ఈ మిత్రపక్షం నాయకుడే వాగ్బాణాలు సంధిస్తూ ఉంటారు. ఇటీవల కొంచెం నెమ్మదించిన ఈ అగ్గిబరాటా నాయకుడు.. తాజాగా మరోసారి కత్తి ఝుళిపించారు. ఈసారి కేవలం కేంద్రాన్ని నిందిస్తున్న చంద్రబాబునాయుడు ను మాత్రమే కాదు - కేంద్రాన్ని నిలదీస్తాం అంటున్న పవన్ కల్యాణ్ ను కూడా కలిపేసి ఓ ఆటాడుకున్నారు.

ప్రధానంగా ఆయన ఫోకస్ మాత్రం చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా సాగడం విశేషం. విభజన చట్టం హామీలను నెరవేర్చడం అనే ప్రక్రియకు 2022 వరకు కాలవ్యవధి ఉండగా.. తొలి నాలుగేళ్లలోనే సమస్తం తమకు డబ్బులు చెల్లించేయాలని చంద్రబాబు ఎందుకింత ఆరాటపడుతున్నారో అర్థం కావడం లేదని సోము వీర్రాజు ఓ ప్రధాన లోపాన్ని ఎత్తిచూపడం ఒక కీలక పరిణామం. అలాగే ఈ నాలుగేళ్లలో కేంద్రం 16 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిందని ఆ సొమ్మును రుణమాఫీ సహా కేంద్రానికి సంబంధం లేని ఇతర అవసరాలకు వాడేసుకుని.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారనేది సోము ఆరోపణ. ఆ 16వేల కోట్లకు సరిగ్గా లెక్కలు చెబితే.. ఇంకా ఎంత సొమ్ము విడుదల కావాలో కూడా లెక్కల్లో వివరిస్తే తేలుస్తాం అని ఆయన అంటున్నారు. 14 వ ఆర్థిక సంఘం తేల్చిన మేరకు కేంద్రం ఇప్పటికే నాలుగువేల కోట్లు చెల్లించగా మరో 600 కోట్లు మాత్రమే పెండింగ్ ఉందని.. దానికోసం బాబు సర్కార్ నానా యాగీ చేస్తున్నారని, మిత్రపక్షంగా ఉండి కూడా ప్రపంచవ్యాప్త ఇమేజిని సొంతం చేసుకుంటున్న మోడీ మీద బురద చల్లే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

పవన్ కల్యాణ్ .. ఏపీలోని మేధావులందరినీ జతచేర్చి.. నిజనిర్ధరణ కమిటీ రూపంలో చేస్తున్న కసరత్తు గురించి సోము వీర్రాజు చాలా తేలికగా మాట్లాడడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఏ మేరకు అమలు చేసిందో చెప్పాల్సిందిగా తాను పవన్ కల్యాణ్ ను అడుగుతానంటూ సోము వీర్రాజు సవాలు విసరడం విశేషం. ఎవరో కొందరితో కొన్ని కమిటీలు వేసినంత మాత్రాన తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంటూ ఆయన కొట్టిపారేయడం గమనార్హం.

Tags:    

Similar News