సుజనాను ఓ ఆటాడుకున్న భాజపా నేత!

Update: 2018-02-04 13:44 GMT
ఏపీలోని భాజపా నాయకుల్లో సోము వీర్రాజు అంటే.. తెలుగుదేశం నాయకులకు ఓ రకమైన జడుపు. ఎందుకంటే.. రాష్ట్ర భాజపా కూడా మాతో సంయమనం పాటించాలి.. తమ ప్రభుత్వం పట్ల సానుకూలంగా మాత్రమే మాట్లాడుతూ ఉండాలి.. అని వారు కేంద్రంలోని అధిష్టానం నుంచి ఎన్ని కబుర్లు చెప్పించుకున్నప్పటికీ..  అలాంటి సూచనల్ని ఖాతరు చేయకుండా.. ఛాన్సు దొరికితే చాలు.. చంద్రబాబు సర్కారు పాలన మీద అడ్డంగా విరుచుకుపడిపోతూ ఉండే నాయకుడు సోము వీర్రాజు. నిజానికి ఏపీలో చంద్రబాబుతో సున్నం పెట్టుకోదలచుకుంటే.. ఆయనకే పార్టీ అధ్యక్షపగ్గాలు కూడా అప్పగిస్తారని అంతా అనుకున్నారు గానీ.. ఎన్నికల సంవత్సరంలో ఈ విభేదాల రాజకీయాలు ఎందుకని భాజపా భావించిందేమో మితవాది కంభంపాటి హరిబాబునే ఎంపికచేశారు. అధ్యక్షపదవిపై తన ఆశలు సన్నగిల్లిన తర్వాత.. తొలిసారిగా కర్నూలులో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు తన సహజశైలిలో చంద్రబాబు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన కాదు వ్యాపారం మాత్రమే జరుగుతున్నదని ఎద్దేవా చేశారు.

మధ్యలో ఆయన విమర్శలు చంద్రబాబునాయుడు మీదనుంచి.. కేంద్రమంత్రి సుజనా చౌదరి మీదకు మళ్లడం విశేషం. ప్రత్యేకించి సుజనా చౌదరి పేరును ప్రస్తావించకపోయినప్పటికీ.. మంత్రివర్యులు.. రాజ్యసభ సభ్యుడు అంటూ.. సుజనా మాటలను ఆయన పదేపదే దెప్పిపొడిచారు. ఆ రాజ్యసభ సభ్యుడు ఇవాళ మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత (చంద్రబాబునాయుడు) అవసరమైతే కాంగ్రెస్ తోనైనా పొత్తు పెట్టుకుని కేంద్రంలో చక్రం తిప్పగలరు .. అనే అర్థం వచ్చేలా మాట్లాడారని.. చంద్రబాబుకు అంతకు దిగజారగల నాయకుడేనని సోము విమర్శించారు.

అలా చెబుతున్న రాజ్యసభ సభ్యుడికి అసలు ఆ పదవి ఎలా వచ్చింది.. రూలింగ్ తో వచ్చిందా ట్రేడింగ్ తో వచ్చిందా.. ? అని అంటూ.. డబ్బులు కుమ్మరించి కొనుక్కుని సుజనాచౌదరి రాజ్యసభ సభ్యుడి పదవిని పొందారనే అర్థం వచ్చేలా సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం విశేషం.

రెండు రోజుల కిందట అమిత్ షాతో ఢిల్లీలో జరిగిన పార్టీ సీనియర్ నాయకుల సమావేశంలో.. తెలుగుదేశం పట్ల మెతకవైఖరితోనే ముందుకుపోవాలని, అదే సమయంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సూచనలు ఎంతమేరకు నిజమో గానీ.. చంద్రబాబు సర్కారును  - తెదేపా నాయకుల్ని ఇరుకున పెట్టడంలో తన జోరు - ఫైర్ ఏమాత్రం తగ్గలేదని సోము వీర్రాజు తాజా మాటలు నిరూపిస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
Tags:    

Similar News