అలిగి.. అండ‌ర్ గ్రౌండ్‌ కి వెళ్లిన సోము!

Update: 2018-05-14 05:15 GMT
పార్టీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. సొంత ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించినా.. త‌న ఓటు పార్టీకే త‌ప్ప ఏపీ ప్ర‌జ‌ల‌కు కాద‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రించే ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజుకు కోపం వ‌చ్చేసింది. సొంత ప్ర‌జ‌ల‌ను సైతం ప‌ట్టించుకోకుండా త‌న వాద‌న‌తో పార్టీ వైపు మొగ్గు చూపుతూ క‌వ‌ర్ చేసే ఆయ‌న.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై అలిగారు.

ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌విని ఆశించిన ఆయ‌న‌కు షాకిస్తూ.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత పార్టీలో చేరిన మాజీ మంత్రి.. కాంగ్రెస్ కు చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు రాష్ట్ర పార్టీ ప‌గ్గాలు అందించ‌టంపై ఆయ‌న కినుకు వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌న్నాకు అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తున్న‌ట్లు పార్టీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డిన త‌ర్వాత.. పార్టీ నిర్ణ‌యం త‌న‌కు శిరోధార్యం అని చెప్పిన ఆయ‌న ఆదివారంసాయంత్రం నుంచి ఎవ‌రికి అందుబాటులో లేకుండా అండ‌ర్ గ్రౌండ్‌కు వెళ్లిపోవ‌టం సంచ‌ల‌నంగా మారింది.

మ‌రోవైపు సోముకు అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఇవ్వ‌నందుకు నిర‌స‌న‌గా కొంద‌రు బీజేపీ నేత‌లు త‌మ పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. త‌మ రాజీనామా లేఖ‌ల్ని పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షాకు పంప‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. పార్టీలో మొద‌ట్నించి ఒక వ‌ర్గాన్ని పెంచి పోషించుకొస్తున్న వీర్రాజు.. తాజా పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష ప‌ద‌వి త‌న‌కే చెందుతుంద‌ని ఆశించారు. అందుకు త‌గ్గ‌ట్లే ప్ర‌చారం చేసుకున్నారు.

కానీ.. ఆయ‌న ఆశ‌ల‌కు.. అంచ‌నాల‌కు భిన్నంగా త‌న‌ను కాకుండా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత పార్టీలోకి వ‌చ్చిన క‌న్నాకు కీల‌క ప‌ద‌విని అప్ప‌గించ‌టం ప‌ట్ల ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు చెబుతున్నారు. సోము వీర్రాజు ఆగ్ర‌హంతో తూర్పు గోదావ‌రి జిల్లాలో మొద‌లైన ముస‌లం.. రాష్ట్ర వ్యాప్తంగా కొన‌సాగుతుంద‌ని.. పార్టీకి చెందిన ఇత‌ర జిల్లాల నేత‌లు సైతం రాజీనామాల బాట ప‌డ‌తార‌ని చెబుతున్నారు. అదే నిజ‌మైతే.. పార్టీకి సోము భారీ షాక్ ఇచ్చిన‌ట్లేన‌ని చెప్పాలి. ఆయ‌న్ను బుజ్జ‌గించేందుకు అవ‌కాశం ఇవ్వ‌కుండా ఎవ‌రికి అందుబాటులోకి రాకుండా అండ‌ర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోవ‌టం హాట్ టాపిక్ గా మారింది. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా.. ధిక్కార స్వ‌రం అన్న‌ది పార్టీలో లేకుండా చేసిన మోడీషాల‌కు మంట పుట్టేలా ఉన్న వీర్రాజు వైఖ‌రి రానున్న రోజుల్లో ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వ్య‌వ‌హారం టీ క‌ప్పులో తుఫానుగా మిగిలిపోతుందా?  లేక‌.. పార్టీ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేస్తుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News