పొత్తుపై వీర్రాజు విశ్లేష‌ణ‌తో టీడీపీ షాక్ ఖాయం

Update: 2017-12-19 08:14 GMT
బీజేపీ ఫైర్‌ బ్రాండ్ నేత‌గా పేరున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు మ‌రోమారు త‌మ మిత్ర‌ప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీపై విరుచుకుప‌డ్డారు.! ఎప్ప‌ట్లాగే త‌న‌దైన శైలిలో కేంద్ర, రాష్ట్ర ప‌థ‌కాలు...వాటిని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ ఘ‌న‌త‌గా ప్ర‌చారం చేసుకుంటున్న తీరును ఎండ‌గ‌ట్టిన వీర్రాజు ఈ సంద‌ర్భంగా దిమ్మ‌తిరిగిపోయే లాజిక్‌ల‌తో టీడీపీతో పొత్తు వ‌ల్ల ప్ర‌యోజ‌నం సున్నా అని తేల్చేశారు. అంతేకాకుండా త‌మ‌ను ఇరకాటంలో ప‌డేసేలా ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారో వివ‌రించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన వీర్రాజు బీజేపీతో పొత్తు విష‌యంలో టీడీపీ నేత‌లు ఇప్ప‌టికీ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీడీపీ చ‌రిత్ర విప్పారు. కాంగ్రెస్ సహకారంతోనే నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబు ఒకరిని ప్రధానమంత్రిని చేశారని వీర్రాజు తెలిపారు. `టీడీపీతో పొత్తు లేనప్పుడే మాకు18 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీతో కలిసి వెళ్లడం వలన 2004 ఎన్నికల్లో ఓడిపోయాం. ఇలాంటి నిర్ణయం చారిత్రక‌ తప్పిదం. ఆ త‌ప్పిదం వ‌ల్లే....10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది` అని వ్యాఖ్యానించారు. 2009 ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ ఓడిపోయిందని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని చారిత్రాత్మక తప్పు చేశామని చంద్రబాబు గతంలో చెప్పారని తిరిగి మ‌ళ్లీ త‌మ ద‌గ్గ‌రికి 2014లో పొత్తుకోసం వ‌చ్చార‌ని వీర్రాజు వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని ఉదయం చెప్పి సాయంత్రానికి చల్లబడ్డారని ఎద్దేవా చేశారు

గుజరాత్ లో ఒంటరిగా వెళ్తే 9 శాతం ఓట్ల తేడాతో గెలిచామ‌ని చెప్పిన వీర్రాజు ఏపీలో టీడీపీ-పవన్ కల్యాణ్‌ తో కలిసి వెళ్తే 2 శాతం ఓట్లతో గెలిశామ‌న్నారు. ప్రతిసారి మిత్రపక్షం చేతిలో మోసం పోతున్నామ‌ని వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయిన‌ప్ప‌టికీ త‌మకు గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని....ప‌నులు కావ‌డం లేద‌న్నారు. అర్హుల‌కు ఇండ్లు - కార్డులు - పింఛన్లు ఇప్పించుకోలేక పోతున్నామ‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇచ్చిన నిధులతో ఏపీలో ప్ర‌చారం చేసుకుంటున్నారని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధుల‌తోనే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్‌ కు 12 - కళా వెంకటరావు కు 12 పతకాలు వస్తున్నాయని అన్నారు. అయిన‌ప్ప‌టికీ....కేంద్ర పథ‌కాల విష‌యంలో లోకేష్ పక్కన ప్ర‌ధాని మోడీది చిన్న బొమ్మ వేస్తున్నారని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

బీజేపీ ఎదుగుతుంటే అడ్డుకొనేందుకు కుట్ర చేస్తున్నారని వీర్రాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కావాల‌నే ప్రత్యేక హోదా తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ప్ర‌త్యేక‌ ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని వీర్రాజు వెల్ల‌డించారు. కాకినాడలో తాము సొంతంగా పోటీ చేసి ఉంటే ఎక్కువ స్థానాల్లో గెలిసే అవ‌కాశం ఉండేద‌ని వీర్రాజు అన్నారు. టీడీపీ వాళ్ళు డబ్బులు ఖర్చుపెట్టి గెలిచార‌ని ఆరోపించారు. కాకినాడకు స్మార్ట్ సిటీ - పోర్ట్‌ ను కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించింద‌ని తెలిపారు. కాకినాడలో చెప్పుకోవడానికి టీడీపీకి ఏమి లేదని ఆయ‌న ఎద్దేవా చేశారు.
Tags:    

Similar News