ఆయనొద్దండయ్యా : సోముకు నడ్డా క్లాస్

Update: 2022-10-20 15:30 GMT
ఉరిమి ఉరిమి మంగళం మీద పడింది అంటారు. అలా పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు  షేక్ హ్యాండ్ ఏమో కానీ బీజేపీలో సోము వీర్రాజు ప్రెసిడెంట్ కుర్చీ షేక్ అయిపోతోంది. 2024 ఎన్నికల ను కూడా తన నాయకత్వంలో చూసేయాలని ఉబలాటపడుతున్న సోము వీర్రాజు జోరుకు హై కమాండ్ చెక్ చెప్పేలా సీన్ ఉంది అంటున్నారు. సోము వీర్రాజు మాకొద్దండయ్యా అని ఏపీలోని 16 జిల్లాల బీజేపీ ప్రెసిడెంట్లు అధినాయకత్వానికి మొర పెట్టుకుంటున్నట్లుగా సమాచారం.

ఆయన వల్ల పార్టీ బలపడలేదని కూడా ఫిర్యాదు చేశారట. అంతే కాదు ఆయనను కొనసాగిస్తే రాజీమాలు చేసి దండం పెట్టి పోతామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక సోము వీర్రాజు జనసేనతో కలసి ఎక్కడా పార్టీ కార్యక్రమాలను నిర్వహించలేదని ఫిర్యాదులు కూడా వెళ్లాయట. రెండు పార్టీలు కలసి జనంలో ఉంటే ఈ పాటికి బీజేపీ బలపడేది అని హై కమాండ్ దృష్టిలో పెట్టారుట.

సోము వీర్రాజు మాత్రం ఒంటెద్దు పోకడలకు పోయి ఇంతలా పరిస్థితిని తెచ్చారని బీజేపీలోని కీలక నేతలు ఫిర్యాదు చేశారని అంటున్నారు. మరో వైపు పవన్ చంద్రబాబు భేటీ నేపధ్యంలో ఢిల్లీ టూర్ కి వెళ్ళిన సోము వీర్రాజుకు బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. పార్టీని ఏపీలో నడుపుతున్న తీరు మీద కూడా ఆగ్రహించారని అంటున్నారు.

అదే టైం లో ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన వారికి ఎలాంటి విలువ గౌరవం ఇవ్వడం లేదన్న ఫిర్యాదుల మీద కూడా సోముని గట్టిగా అడిగారని అంటున్నారు. మరో వైపు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ డియోధర్ విషయంలో కూడా కేంద్ర పార్టీ నాయకత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది అంటున్నారు. అలాగే 2024 ఎన్నికల వరకూ సోమునే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా కొనసాగిస్తామని పార్టీ జనరల్ సెక్రటరీ శివప్రకాశ్ చేసిన  ప్రకటనపైనా హై కమాండ్ ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి చూస్తే సోము వ్యవహార శైలి మీద, అలాగే జగన్ సర్కార్ వైఫల్యాల మీద పోరాటం  చేయని విషయంలో కూడా బీజేపీ పెద్దలు గుర్రు మీద ఉన్నారని అంటున్నారు. ఇదే అదనుగా బీజేపీలో సోము వైఖరి మీద బీజేపీలో  అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారు కూడా ఇపుడు ఫిర్యాదులు చేయడానికి రెడీ అవుతున్నారుట.  సోము 2024 ఎన్నికల దాకా కంటిన్యూ అవుతారా అంటే ఏం జరుగుతుందో చూడాల్సిందేనట.  ఇదండీ మ్యాటర్

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News