సోనియాజీ... ఇప్పుడు క‌ళ్లు తెరిచారా?

Update: 2018-02-08 10:37 GMT
మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్‌లో తెలుగు నేల‌కు ప్ర‌త్యేకించి ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ఇప్పుడు వాడీవేడీ వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని చెప్పాలి. ఏపీ వ్యాప్తంగా నేడు ప్ర‌జ‌లంతా బంద్ పాటిస్తుండ‌గా - సీపీఐ ఇచ్చిన ఈ బంద్ పిలుపున‌కు విప‌క్షాల‌తో పాటుగా ఏకంగా అధికార ప‌క్షం టీడీపీ కూడా మ‌ద్దతు ప‌లికింది. అధికారంలో ఉన్న పార్టీలు బంద్‌కు పిలుపునివ్వ‌డం బ‌హు అరుద‌నే చెప్పాలి. అయితే రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయంపై ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ గ‌ళం విప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో సీపీఐ ఇచ్చిన బంద్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన టీడీపీ... శాంతియుతంగా బంద్ కొన‌సాగించాల‌ని కోరింది. అదే స‌మ‌యంలో ఢిల్లీలో అన్ని పార్టీల ఎంపీలు కూడా ఏపీకి న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ పోరులో మొద‌ట కాస్తంత డ‌ల్ గా క‌నిపించిన టీడీపీ ఎంపీలు గ‌డ‌చిన మూడు రోజులుగా జూలు విదిల్చేశారు. ఇత‌ర పార్టీల ఎంపీల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా, ఇత‌ర పార్టీల ఎంపీల కంటే కూడా కాస్తంత గ‌ట్టి పోరాట‌మే చేస్తున్న టీడీపీ ఎంపీలు న‌రేంద్ర మోదీ స‌ర్కారుకు నిజంగానే చుక్క‌లు చూపిస్తున్నారు. అస‌లు టీడీపీ ఎంపీల నిర‌స‌న‌ల‌తో పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల స‌మావేశాలు దాదాపుగా స్తంభించిపోయాయ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

నిత్యం స‌భ‌లో వెల్ లోకి దూసుకువెళుతున్న టీడీపీ ఎంపీలు.. ఏపీకి జ‌రిగిన అన్యాయంపై కేంద్రం స్పందించాల‌ని, ఇప్ప‌టికిప్పుడు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మేర‌కు రాష్ట్రానికి న్యాయం చేయాల‌ని, ఇది ఇప్పుడే జ‌రిగిపోవాల‌ని పెద్ద పెట్టున నిన‌దిస్తున్నారు. టీడీపీ ఎంపీల నిర‌స‌న‌ల‌తో శాంతమూర్తిగా క‌నిపించే లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారంటే... టీడీపీ ఎంపీల పోరు ఏ రేంజీలో కొన‌సాగుతుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం ప్రారంభ‌మైన లోక్ స‌భ సమావేశాల్లో భాగంగా ఆస‌క్తిక‌ర ప‌రిణామం క‌నిపించింది. స‌భ‌లో విప‌క్ష స్థానంలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మ‌హిళా ఎంపీ... టీడీపీ ఎంపీల‌ను త‌న వ‌ద్ద‌కు పిలుచుకుని మ‌రీ మాట్లాడ‌టం అందరి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ మహిళా ఎంపీ ఎవ‌రో అయితే... ఈ దృశ్యం అంద‌రినీ ఎలా ఆక‌ట్టుకుంటుంది చెప్పండి? ఆమె ఎవ‌రో కాదు... గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ కు సుదీర్ఘ కాలం పాటు అధ్య‌క్ష‌రాలిగా వ్య‌వ‌హ‌రించి స‌రికొత్త రికార్డుల‌కు ఎక్కిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, రాయ‌బ‌రేలీ ఎంపీ సోనియా గాంధే. తెలుగు నేల‌ను రెండుగా విభజన చేసిన ప్ర‌క్రియ‌లో సోనియాదే కీల‌క భూమిక అన్న విష‌యం తెలిసిందే.

నాడు యూపీఏ ప్ర‌భుత్వంలో ప్ర‌ధానిగా మ‌న్మోహ‌న్ సింగ్ ఉన్నా... యూపీఏ చైర్ ప‌ర్స‌న్‌గా ఉన్న సోనియా గాంధే మొత్తంగా తెర వెనుక ఉండి పాల‌న సాగించారన్న విష‌యం తెలిసిందే క‌దా. ఈ క్ర‌మంలో రాష్ట్ర విభ‌జ‌న కూడా ఆమె తీసుకున్న నిర్ణ‌య‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. విభ‌జ‌న‌లో ఎలాంటి రాజ్యాంగబ‌ద్దత పాటించ‌కుండానే... సీమాంధ్రుల అభీష్టాలకు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హరించిన సోనియా.. తెలంగాణ‌లో గెలిస్తే చాలు త‌న కుమారుడిని ప్ర‌ధానిని చేసుకోవ‌చ్చ‌ని భావించారు. అయితే ఆమె వ్యూహం ఫెయిల్ కావ‌డంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌నంత మేర ప‌రాభవం జ‌రిగిపోయింది. ఆ త‌ర్వాత కూడా ఏపీ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది? అన్న విష‌యంపై  ఏనాడూ దృష్టి సారించ‌ని సోనియా... నేటి ఉద‌యం మాత్రం అనూహ్యంగా... త‌న‌కు వైరి వ‌ర్గంగా ఉన్న టీడీపీ ఎంపీల‌ను త‌న వ‌ద్దకు పిలుచుకుని మ‌రీ ఏపీ స‌మస్య‌ల‌పై ఆరా తీశారు. సోనియా పిల‌వ‌గానే... టీడీపీ ఎంపీలు తోట న‌రసింహం - కేశినేని నాని - రామ్మోహ‌న్ నాయుడు - ర‌వీంద్ర‌లు... ఆమె వ‌ద్ద‌కు ప‌రుగెత్తుకుని వెళ్లి మ‌రీ ఏపీ ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. మొత్తానికి ఈ రోజు స‌మావేశాల్లో ఈ దృశ్య‌మే హైలెట్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News