రాహుల్ అధ్యక్ష పదవి ఎందుకివ్వలేదు..?

Update: 2015-09-08 07:28 GMT
రాహుల్ గాంధీ ఏం ఆశించినా అది ఆయన చెంతకు చేరడం లేదు... ప్రధాని పీఠంపై పాపం ఎన్నో ఆశలు పెట్టుకోగా ఈసారి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉనికిలోకి లేకుండా పోవడంతో ఆ కోరిక తీరలేదు... అయితే.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కుతుందని భావించినా... ఇప్పుడు ఆ కోరిక కూడా ఇప్పట్లో తీరేలా లేదు.

మరో ఏడాది వరకు రాహుల్ గాంధీకి పార్టీ కెప్టెన్సీ దక్కే అవకాశం లేదట.... ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారట. పైకి ప్రకటించకపోయినా సోనియాగాంధీ ఆరోగ్యం బాగులేకపోవడం.. రాహుల్ ను పార్టీలో కీలక నేతగా ఎదిగేలా చేయడానికి గాను ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన కొన్నాళ్లుగా ఉంది. అయితే... దానిని మరో ఏడాదికి వాయిదా వేశారు. ఈ ఏడాది కాలం సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు.

అయితే... రాహుల్ కు పార్టీ అధ్యక్ష పదవి ఈ ఏడాది ఇవ్వకపోవడానికి కారణాలు వేరని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో రాహుల్ ఎన్నికల సారథ్య బాధ్యతలు చూశారు... దేశంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది... దీంతో రాహుల్ సామర్థ్యాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి... ఇప్పుడు కూడా కాంగ్రెస్ పరిస్థితేమీ అద్భుతంగా లేదు... అదేసమయంలో ఈ ఏడాది బీహార్.. వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు సాధ్యం కాదు. దీంతో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత వరుసగా రాష్ట్రాల్లో ఓడిపోతుంటే రాహుల్ కి అది తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆలోచించిన సోనియా ఈ ఏడాది రాహుల్ కు అధ్యక్ష పదవి వద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 17 ఏళ్లుగా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తానే ఆ ఓటమి భరిస్తాను కానీ కుమారుడికి అ ప్రతిష్ఠ రానివ్వనని ఆమె అనుకుంటున్నట్లు సమాచారం.
Tags:    

Similar News