ఉస్మానియా ఆస్పత్రి మాదిరి బరేలీలో: వర్షపు నీటిలో ఆస్పత్రి

Update: 2020-07-20 09:10 GMT
ఋతుపవనాల చురుకుదనంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాలు రైతులకు మేలు చేస్తుండగా వైరస్ బాధితులకు మాత్రం నరకం చూపుతోంది. ఈ వర్షాలతో వైరస్ బాధితులు మరింత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో వర్షపు నీరు చేరి తీవ్ర వివాదం రేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అలాంటిదే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న వార్డులోకి నీరు వచ్చి చేరింది. దీంతో బాధితులు.. వారి కుటుంబసభ్యులతో పాటు వైద్యులు.. వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు అధికార బీజేపీ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్‌ బరేలీలోని రాజ్ శ్రీ మెడికల్ కాలేజీలో ఉన్న వైరస్ వార్డులో కుండపోతగా వర్షపు నీరు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్షపు నీరు వెళ్లే పైపు పగలిపోవడంతో నీరు ఆ వార్డులోకి వచ్చినట్లు ఆస్పత్రి నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌ అయింది. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నిర్లక్ష్యం చేస్తున్నారని.. ఆ వైఖరికి ఈ ఘటన అద్దం పడుతోందంటూ సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేశాయి. ఈ వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటన పట్ల వైరస్  బాధితులు, హెల్త్ వర్కర్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. బరేలీలోని కోవిడ్ ఆస్పత్రిలో నెలకొన్న దుస్థితి ఆందోళన కలిగిస్తుందని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
Tags:    

Similar News