హుజూర్ నగర్ హీటెక్కింది..ఉత్తమే గెలిచారు

Update: 2019-10-20 13:38 GMT
తెలంగాణలో ఉప ఎన్నికకు కార్యరంగం సిద్ధమైపోయిన హుజూర్ నగర్ లో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. జిల్లా రిటర్నింగ్ అధికారి హోదాలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఎన్నికల నియామవళి కత్తి తీస్తే... దానిని కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి భర్త - టీ పీసీసీ చీప్ తుత్తునీయలు చేసేశారు. నిబంధనల పేరుతో ఉత్తమ్ ను హుజూర్ నగర్ నుంచి సాగనంపే పనికి అధికారులు శ్రీకారం చుడితే... లోకల్ అస్త్రం తీసిన ఉత్తమ్ అధికారుల ప్లాన్ ను ఆదిలోనే చిత్తు చేశారు. మొత్తంగా జిల్లా ఎస్సీ వర్సెస్ ఉత్తమ్ గా మారి... హుజూర్ నగర్ ను వేడెక్కించిన ఫైట్ లో ఉత్తమే విజేతగా నిలిచారు. ఇందుకు ఏ నిబంధనలను అయితే అదికారులు తీశారో, అవే నిబంధనలను చూపుతూ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన ఉత్తమ్ విజయం సాధించారు.

ఆసక్తి రేకెత్తించిన ఈ వ్యవహారం వివరాల్లోకి వెళితే.. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగానే మొన్నటిదాకా కొనసాగిన ఉత్తమ్ ఎంపీగా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే కదా. ఉత్తమ్ రాజీనామాతోనే ఇప్పుడు హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక జరుగుతోంది కదా. తన స్థానంలో తన సతీమణి పద్మావతికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకున్న ఉత్తమ్... అధికార పార్టీ టీఆర్ఎస్ కు మరోమారు హుజూర్ నగర్ లో షాకిచ్చేందుకు పక్కాగా వ్యూహం అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో మొన్నటిదాకా తనంటే అంతెత్తున ఎగిరి పడ్డ కోమటిరెడ్ది వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలతో కూడా ఉత్తమ్ సంధి చేసుకున్నారు కూడా. సరే... ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. పద్మావతి తరఫున టీ కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా ప్రచారం చేశారు. ఇప్పుడు పోలింగ్ కు సమయం ఆసన్నమైంది కదా. స్థానికేతరులు హుజూర్ నగర్ ను విడిచివెళ్లాలి కదా. ఇక్కడే కలెక్టర్ నియమావళిని బయటకు తీసి... ఉత్తమ్ కు ఫోన్ చేసి తక్షణమే హుజూర్ నగర్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. ఈ ఫోన్ కాల్ తో ఉత్తమ్ ఉగ్రరూపం దాల్చారు.

వాస్తవానికి ఉత్తమ్ కు కోదాడలో ఓటు హక్కు ఉంది. అయినా కూడా గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచే బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో నల్లొండ నుంచి ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న హుజూర్ నగర్ కూడా ఉత్తమ్ ఎంపీగా కొనసాగుతున్న పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. కలెక్టర్ ఫోన్ చేయగానే... ఓ రేంజిలో ఫైరైపోయిన ఉత్తమ్... హుజూర్ నగర్ లో తాను నాన్ లోకల్ కాదని, పక్కా లోకల్ అని తేల్చి చెప్పారు. అంతటితో ఆగని ఉత్తమ్... కలెక్టర్ పోన్ కాల్ పై నేరుగా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఉత్తమ్ వాదనతో పాటు కలెక్టర్ వివరణను తీసుకున్న ఈసీ... ఉత్తమ్ హుజూర్ నగర్ విడిచివెళ్లాల్సిన అవసరం లేదని తేల్చేసింది. దీంతో ఆసక్తి రేకెత్తించిన ఈ ఫైట్ లో ఉత్తమ్ విజయం సాధించేశారు. లోకల్ విషయంలోనే విజయం సాధించిన ఉత్తమ్... పోలింగ్ లోనూ తన సతీమణిని గెలిపించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News