అయోధ్యపై స్పెషల్ ఫోకస్.. సాంస్కృతిక రాజధానిగా డిజైన్

Update: 2022-01-04 00:30 GMT
రామజన్మభూమి అయోధ్య అభివృద్దిని భాజపా ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆ ప్రాంతంలో శ్రీరాముని మందిరాన్ని నిర్మించడానికి ఎంతో శ్రమించి... ఫలిచింది. రామమందిరం పూర్తయ్యేలోపు అయోధ్యను సాంస్కృతిక రాజధానిగా మార్చాలనేది ప్రధాని నరేంద్ర మోదీ ఆశయం. అందుకే ఆ ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు, రైల్వే మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇక పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.4వేల కోట్లతో 84 కోసి పరిక్రమ్ మార్గ్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారికి ఇటీవల జాతీయ హోదా లభించింది.  275 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో ఉండే రోడ్డును... దాదాపు 51 పుణ్య క్షేత్రాలకు అనుసంధినిస్తూ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకోసం సర్వేకూడా పూర్తయినట్లు సమాచారం.

గోరఖ్ పూర్- లక్నో జాతీయ రహదారిని సైతం అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు రూ.10 వేల కోట్ల నిధులతో అయోధ్య మీదుగా వెళ్లే ఈ రోడ్డును ఆరు వరుసల రహదారిగా డిజైన్ చేయనున్నారు. అందుకు కూడా కేంద్రం పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇకపోతే రూ.ఆరువేల కోట్ల నిధులతో 70 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు లభించాయి. ఈ రోడ్డుకు జనవరి 6న కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భూమి పూజ చేయనున్నారు. వీటితోపాటు నాలుగు ఓవర్ బ్రిడ్జిలు, ప్రధాన రహదారులు, సరయు నదిపై రెండు వంతెనలు నిర్మించనున్నారని ఎంపీ లల్లూ సింగ్ ప్రకటించారు. బైపాస్ తో అనుసంధానం చేస్తూ... అత్యాధునికంగా తీర్చి దిద్దుతామని వెల్లడించారు. అంతేకాకుండా అయోధ్యకు మంచి గుర్తింపు వస్తుందని... ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అత్యాధునికమైన రవాణా సౌకర్యాలతో రామ జన్మభూమిని తీర్చి దిద్దాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి దక్కేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈ ఏర్పాట్లను చేస్తోంది. శరవేగంగా అయోధ్యకు అనుసంధానం చేసిన రహదారుల నిర్మాణం, రీ డిజైన్ పనులు జరుగుతున్నాయి. కొన్ని భూ సేకరణ దశలో ఉంటే మరికొన్ని డీపీఆర్ పూర్తి చేసుకున్నాయి. కాగా రామమందిర నిర్మాణం పూర్తయ్యే లోపు ఈ రోడ్లన్నీ కూాడా సుందరంగా ముస్తాబుకానున్నాయి. ఎక్కడినుంచి వచ్చే ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టారు.

అనేక హంగులతో రాములోరి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దేశ, విదేశీ నిపుణులతో ఆలయం రూపుదిద్దుకుంటోంది. భారత దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా మందిరాన్ని కడుతున్నారు. అయోధ్యలో అడుగడుగునా ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ అడుగుపెట్టగానే రామనామ స్మరణ వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. ఈ విధంగా కళ్లుమిరుమిట్లు గొలిపేలా.. మనస్సు ఆధ్యాత్మికతతో నిండిపోయేలా అయోధ్యను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాంతాన్ని దేశ సాంస్కృతిక రాజధానిగా... ప్రపంచ సాంస్కృతిక ప్రదేశంగా ఖ్యాతి గడించేలా ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇకపోతే అయోధ్య నిర్మాణంలో సామాన్యులు సైతం భాగస్వామ్యం అయ్యే వెసలుబాటు కల్పించారు.
Tags:    

Similar News