నా భార్య నీకు..నీ భార్య నాకు..సుప్రీం సీరియస్

Update: 2016-05-13 08:27 GMT
బైకులు.. కార్లు మార్చుకున్నట్లుగా.. భార్యల్ని మార్చుకునే దుష్ట సంప్రదాయం మీద సుప్రీం కోర్టు సీరియస్ అయింది. హై ప్రొఫైల్ సొసైటీలో విస్తరిస్తున్న వైఫ్ స్వాపింగ్ కల్చర్ ను తప్పుబడుతూ.. కేరళకు సంబంధించిన ఓ నేవీ ఆఫీసర్ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. తన భర్త.. అతడి స్నేహితులు వైఫ్-స్వాపింగ్ పార్టీలు చేసుకున్నారని.. వారి గ్రూపులో చేరనందుకు తనను చిత్రహింసలకు గురిచేశారని ఓ నేవీ ఆఫీసర్ భార్య చేసిన సంచలన ఆరోపణలపై విచారణ జరపడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలలలోపు విచారణ పూర్తి చేయాలని గడువు కూడా విధించింది. 2013 ఏప్రిల్ 4న కోచి హార్బర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఈ మేరకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం రేపింది.

బాధితురాలికి 2012 మార్చిలో ఓ నేవీ అధికారితో పెళ్లి జరిగింది. వీళ్లిద్దరూ కొచ్చిలో కాపురం పెట్టారు. ఐతే ఆమె భర్త సహ అధికారులకు వైఫ్ స్వాపింగ్ పార్టీలు చేసుకోవడం అలవాటు. అలాంటి ఓ పార్టీలో తనను పాల్గొనాల్సిందిగా భర్త ఒత్తిడి చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఒప్పుకోనందుకు తనను భర్త చిత్రహింసలు పెట్టినట్లు ఆమె వెల్లడిచింది. అంతే కాక ఓ సీనియర్ ఆఫీసర్ భార్యతో తన భర్తను కాంప్రమైజింగ్ పొజిషన్లో చూసినట్లు కూడా ఆమె ఆరోపించింది. తన భర్త స్నేహితులు.. ఉన్నతాధికారులు తనను లైంగికంగా వేధించారని ఆమె చెప్పింది. భర్తతో పాటు అత్తమామలు.. ఆడపడుచు కూడా వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించింది. వీళ్లందరిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మొదట ఈ కేసు కేరళ హైకోర్టులో విచారణకు రాగా.. కేరళలో తన ప్రాణాలకు ముప్పు ఉందని.. ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని బాధితురాలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. సీబీఐతో విచారణ చేయించాలని కోరింది. ఐతే ఆమె విన్నపాన్ని తిరస్కరించిన సుప్రీం కోర్టు కేరళ పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణను చేయాలని ఆదేశించింది.
Tags:    

Similar News