స్టార్లు ఓడిపోయారు..ఆటగాళ్లకు మిశ్రమ ఫలితం

Update: 2016-05-20 07:39 GMT
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈసారి కొన్ని ఫలితాలు భలే విచిత్రంగా అనిపించాయి. సాధారణంగా తమిళనాడులో సినీ నటులు ఓడిపోవడమన్నది తక్కువ. అందులోనూ అగ్రశ్రేణి నటుల విజయానికైతే డోకాయే ఉండదు. కానీ...  తమిళ నటుడు శరత్ కుమార్ - కెప్టెన్ విజయ్ కాంత్ లకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తిరుచ్చేందుర్ నుంచి పోటీ చేసిన శరత్ కుమార్ తన సమీప అభ్యర్ధి అనిత రాధా కృష్ణన్  చేతిలో ఓటమి పాలయ్యారు. మరో నటుడు - ఢీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ ఉలుందూర్ పేట్ నుంచి పోటీ చేయగా.. 34,447 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. గతంలో శరత్ కుమార్ తెంకాసి నుంచి - విజయ్ వృద్దాచలం - రిశివండియమ్ నియోజక వర్గాలనుంచి గెలుపొందారు. ఈసారి మాత్రం ఇద్దరూ బొక్కబోర్లా పడ్డారు.

మరోవైపు కేరళలోనూ  నటులకు పరిస్థితి అలాగే ఉంది.  మలయాళీ నటుడు పి‌వి జగదీష్ కుమార్ ఓడిపోయారు. మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కూడా ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఇక బెంగాల్ విషయానికొస్తే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించి గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నా కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేసిన సినీహీరో సోహమ్ చక్రవర్తి ఓడిపోయారు. బార్జోరా నుంచి పోటీ చేసిన ఆయన సీపీఎం అభ్యర్థి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. బెంగాల్ లోనే బుల్లి తెర నటి రూపా గంగూలి కూడా ఓడిపోయారు. ఆమె బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

కాగా బెంగాల్ ఆటగాళ్ల విషయంలో మిశ్రమ ఫలితం కనిపించింది. ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు బైచుంగ్ భుటియా తృణమూల్ నుంచి పోటీ చేసి పరాజయం పాలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సిలిగురి నుంచి పోటీ చేసిన ఆయన సీపీఎం అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కానీ... తృణమూల్ నుంచి పోటీ చేసిన ఇండియన్ టీం మాజీ బౌలర్ లక్ష్మీరతన్ శుక్లా మాత్రం గెలుపు సాధించారు. ఆయన బీజేపీ అభ్యర్థి రూపా గంగూలీని ఓడించారు. రూపా గంగూలీ - శుక్లాలు హౌరా ఈస్ట్ నియోజకవర్గంలో తలపడ్డారు.
Tags:    

Similar News