అయోధ్యపై ఆ లెక్కలతోనే మోడీ సర్కారు తాజా నిర్ణయం

Update: 2020-02-06 05:19 GMT
సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది మోడీ సర్కారు. దశాబ్దాల పాటు పెండింగ్ లో ఉన్న అంశాల్ని వరుస పెట్టి తేల్చేసే ధైర్యం వారి సొంతం. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి కీలక ప్రకటనను లోక్ సభలో చేయటం తెలిసిందే. ఇప్పుడే ప్రధాని నోటి వెంట రామ మందిర ప్రకటన వచ్చిందన్నది ఆసక్తికరంగా మారింది. ఓవైపు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. రామమందిర నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. ఆ సమయంలో ప్రధాని మోడీ కాషాయ రంగు తలపాగాను ధరించటం గమనార్హం.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు వీలుగానే అయోధ్యలో రామాలయ ప్రకటనను కేంద్రం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాల మాట కూడా ఇదే. అయితే.. ఈ వాదనలో నిజమెంత? అన్నది చూస్తే.. కొంతమేర నిజమేనని చెప్పాలి. అదే సమయంలో అయోధ్యలోని వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మర్చిపోలేం.

అయోధ్యలో రామాలయ నిర్మాణ ట్రస్ట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు మూడు నెలలు గడువిచ్చింది. ఈ గడువు ఈ నెల తొమ్మిదితో ముగియనుంది. అందుకే.. హడావుడిగా ప్రధాని ప్రకటన చేయాల్సి వచ్చిందని భావిస్తున్నా.. అలా అనుకుంటే ముందే చేయొచ్చు కదా? అన్న ప్రశ్నకు మాత్రం.. ఢిల్లీ ఎన్నికల్ని పరిగణలోకి తీసుకొనే.. మోడీ సర్కారు వ్యూహాత్మకంగా ప్రకటన చేసిందన్న మాట వినిపిస్తోంది.

ఇక ట్రస్టు ఛైర్మన్ గా సీనియర్ న్యాయవాది కేశవ అయ్యంగార్ పరాశరన్ వ్యవహరించనున్నారు. ట్రస్టులో తొమ్మిది మంది శాశ్విత సభ్యులు.. ఆరుగురు నామినేటెడ్ సభ్యులతో కలిసి మొత్తం 15 మంది సభ్యులు ఉండనున్నారు. వీరిలో ఒకరు దళితుడు కూడా ఉండనున్నట్లుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. తాజా ట్రస్టును చూస్తే.. అందులో రాజకీయ నేతలకు స్థానం కల్పించలేదు. ట్రస్టు మొత్తం సాధు సంతులకు అవకాశాన్ని కల్పించారు. ఇక.. ట్రస్టు కార్యాలయం ఎక్కడ విషయంలోకి వెళితే.. ట్రస్టు ఛైర్మన్ గా ఎంపికైన పరాశరన్ ఇల్లే ఆఫీసుగా మారనుంది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.

శాశ్విత సభ్యులు ఎవరంటే..
% ప్రయాగ్‌రాజ్‌ జ్యోతిష పీఠాధిపతి స్వామి వాసుదేవానంద్‌
% ఉడిపి మఠాధిపతి జగద్గురు మాధవాచార్య స్వామి విశ్వ ప్రసన్నతీర్థ
% హరిద్వార్‌కు చెందిన యుగపురుష్‌ పరమానంద్‌
% పుణేకు చెందిన స్వామీ గోవిందదేవ్‌
% అయోధ్య రాజకుటుంబీకుడు విమలేందు మోహన్‌ ప్రతా ప్‌ మిశ్రా
% అయోధ్యలో హోమియోపతి డాక్టరు అనిల్‌మిశ్రా
% 1989లో వీహెచ్‌పీ శిలాన్యాస్‌ వేళ.. పునాదిరాయి వేసిన పట్నాకు చెందిన కమలేశ్వర్‌ చౌపాల్‌ (దళితుడు)
% నిర్మోహీ అఖాడా చీఫ్‌ మహంత్‌ ధీరేంద్ర దాస్‌
నామినేటెడ్ సభ్యులు (అందరూ హిందువులే ఉంటారు)
% కేంద్ర సర్వీసులో ఉన్న జాయింట్‌ సెక్రటరీ హోదా ఉన్న ఐఎఎస్‌ అధికారి
% రాష్ట్ర ప్రభుత్వ ఐఏఎస్‌ అధికారి.. అయోధ్య కలెక్టర్‌
% రామాలయ నిర్మాణ ప్రాంగణ వ్యవహారాలు చూసే పాలకమండలి ఛైర్మన్‌


Tags:    

Similar News