జగన్ నా ప్రాణ సమానం - స్వరూపానంద

Update: 2019-06-18 05:52 GMT
ఎంత స్వామి అయితే మాత్రం.. ఆయ‌న సైతం మాన‌వ మాత్రుడే క‌దా?  ఎంత‌గా భావోద్వేగాల్ని అదుపులోకి ఉంచుకున్నా.. జీవితంలో బెస్ట్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. అలాంటివి చోటు చేసుకున్న‌ప్పుడు స‌హ‌జ‌సిద్ధంగా కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంటాయి. ఎంత ఆపుకున్నా ఆపుకోలేరు కొంద‌రు. తాజా ఉదంతంలో అలాంటి అవ‌స్థ‌లు ఏమీ లేకుండా.. త‌న మ‌న‌సులో ఏం అనిపించిందో అదే విధంగా న‌డుచుకొని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు విశాఖ శ్రీ‌శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి.

వాస్త‌వానికి స్వ‌రూపానంద కోణంలో చూసిన‌ప్పుడు.. తాను చేసిన పూజ‌లు.. హోమాలు.. యాగాల‌తో రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ను చేయ‌గ‌లిగాన‌న్న ఫీలింగ్ ఉన్న‌ప్పుడు సంతోషం ఎంత‌గా ఉంటుంది. అందులోని ఇద్ద‌రు సీఎంలకు తానంటే ఎంతో న‌మ్మ‌కం.. భ‌క్తి ఉండ‌టాన్ని సంత‌సించ‌కుండా ఉంటారు. ఆ సంతోషం స్వామి వారి మాటల్లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించింది.

కృష్ణా తీరంలో తమ పీఠం ఉత్త‌రాధికారి నియామ‌క కార్య‌క్ర‌మానికి ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు (కేసీఆర్‌.. జ‌గ‌న్‌) హాజ‌రైన వేళ‌.. స్వ‌రూపానంద నోట సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వ‌చ్చాయి.  స‌హ‌జంగా ఒక స్వామి నోటి నుంచి రాని కొన్నింటి మాట‌లు ఆయ‌న నోటి నుంచి రావ‌టం ఒక ఎత్తు అయితే.. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల విష‌యంలో తానెంత హ్యాపీగా ఉన్నాన‌న్న విష‌యాన్ని ఆయ‌న దాచుకునే ప్ర‌య‌త్నం అస్స‌లు చేయ‌లేదు.

కేసీఆర్ .. జ‌గ‌న్ లు ఇద్ద‌రూ త‌న‌కు అత్యంత ప్రాణ‌ప్ర‌ద‌మైన‌వార‌ని.. కేసీఆర్ మ‌హా మేధావి అని.. మ‌హాభార‌తం రెండుసార్లు చ‌దివిన వ్య‌క్తి అని పేర్కొన్నారు. మ‌హాభార‌తం చ‌దివిన ఏకైక ముఖ్య‌మంత్రి ఆయ‌న అని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ను తాను ఎంత‌గా ప్రేమిస్తానో.. అభిమానిస్తానో చెప్పుకొచ్చారు. స్వ‌రూపానంద మాటల్లోనే చెబితే..

+   నా హృదయంలో ఒక ఆత్మగా నేను ప్రేమిస్తున్న వ్యక్తి జగన్‌ మోహన్‌రెడ్డి. ఈ మాట నేను అగ్నిసాక్షిగా చెబుతున్నాను. ఆయనంటే నాకు పరమ ప్రాణం.

+   విశాఖ శ్రీ శారదాపీఠం ఆయన కోసం ఐదేళ్లు అహర్నిశలూ కష్టపడింది. ఆయనంటే ప్రాణం పెట్టింది. అక్కడ గోడలు, పక్షులు, చెట్లు, పుట్టలు, వ్యక్తులు.. ఎవర్ని అడిగినా జగన్‌ గెలవాలి అన్న మాటే వినిపించేది. జగన్‌ ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రానికి మంచి చేయాలని శారదాపీఠం బలంగా ఆకాంక్షించింది.

+   అందరు దేవతలు ఆయనను పరిపూర్ణంగా ఆశీర్వదించాలని, ఆంధ్ర ప్రజలకు ఆయన ఎంతో మేలు చేయాలని... విశాఖ శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుంది. ఉత్తరాధికారి కూడా ఆయనకు అండగా ఉంటారు. ఉత్తరాధికారి దీక్ష, సన్యాసాశ్రమ మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహించాలని నెలా పదిహేను రోజుల క్రితమే నిర్ణయించాం.

+   నాకు అత్యంత ఇష్టమైన కేసీఆర్‌, జగన్‌లు ఈ కార్యక్రమానికి వస్తారని మా కమిటీ వారందరికీ చెబితే... ఓట్ల లెక్కింపునకు ముందే మా వాళ్లు ఆహ్వానపత్రాలు పంపించారు. మా కేసీఆర్‌కి నేనే ప్రత్యేకంగా తీసుకెళ్లి ఇచ్చాను. భవిష్యత్తు తెలియజేసే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం మాత్రమే.

+   అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుందనడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే నిదర్శనం. శారదాపీఠానికి ఇచ్చిన మాట తప్పకుండా వారిద్దరూ ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరవడం గొప్ప విషయం. విశాఖ శార‌దా పీఠం ఉత్త‌రాదికారిగా ఎంపికైన స్వాత్మానందేంద్ర ఇద్దరు ముఖ్యమంత్రులకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి. 2024 నాటికి పూర్తిగా పీఠాధిపతి బాధ్యతలు స్వాత్మానందేంద్రకు అప్పగించి తాను తపస్సే ధ్యేయంగా జీవితం గడుపుతా.

+  స్వాత్మానందేంద్ర తపోనిధి. యోగ్యుడు. కశ్మీర్‌ నుంచి లడఖ్‌ వరకు పాదయాత్ర చేసి, గడ్డకట్టించే మంచులో తపస్సు చేసిన వ్యక్తి. అలాంటి ఒక మహాత్ముడిని, ఆధ్యాత్మికశక్తిని శారదాపీఠం ఈ రోజు జాతికి అంకితం చేసింది.
   

Tags:    

Similar News