నాపై కేసు కుట్రపూరితం...చట్టపరంగా ఎదుర్కుంటా
టీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శ్రీధర్ బాబు మధ్య వివాదం ముందురుతోంది. కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం ముత్తారం టీఆర్ ఎస్ నేతపై అక్రమ కేసులు బనాయించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై శ్రీధర్ బాబు గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ నేతలపై ప్రభుత్వం కేసులు నమోదు చేయిస్తోందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని శ్రీధర్ బాబు అన్నారు.
తమ ప్రాంతానికి సంబందించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నామని తెలిపిన శ్రీధర్ బాబు...తమకు మద్దతు పలుకని కాంగ్రెస్ నేతలను టీఆర్ ఎస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని శ్రీధర్ బాబు విమర్శించారు. భూనిర్వాసితులకు అండగా ఉన్నామన్న కక్షతోనే కేసులు పెట్టిస్తోందని, ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటామని శ్రీధర్ బాబు అన్నారు. కాగా, శ్రీధర్ బాబుపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా.... అతని అనుచరులు సుదర్శన్ - బార్గవ్ - నాగరాజులను పోలీసులు అరెస్టు చేశారు.