వారం తిరక్కుండానే మరో రికార్డు.. నిజంగా అతడిది ఉసేన్ బోల్ట్ తలదన్నే పరుగే..!

Update: 2021-03-30 03:36 GMT
కంబాళ పోటీల్లో మరో రికార్డు నమోదయింది. భారత ఉసేన్ బోల్ట్ గా పేరు సంపాదించుకున్న శ్రీనివాస గౌడ   100 మీటర్ల దూరాన్ని కేవలం 8.78 చేరుకొని నయా రికార్డు సృష్టించాడు. దీంతో అతడిపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కర్ణాటకలో ఏటా  కంబాళ పోటీలు సాంప్రదాయబద్దంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గం చెందిన వారితో మాత్రమే ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. కంబాళ కర్ణాటక లోని దక్షిణ కన్నడ, ఉడిపి, తుళునాడు తీరప్రాంతాల్లో నిర్వహించే సాంప్రదాయ క్రీడ. ఈ ఆటలో పోటీదారుడు ఎద్దులను రెచ్చగొడుతూ బురద నీటిలో పరుగెత్తాల్సి ఉంటుంది.

 ఆదివారం కర్ణాటకలోని బంత్వాల్  తాలూకా పరిధిలో 125 మీటర్ల కంబాళ పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న శ్రీనివాస గౌడ లక్ష్యాన్ని 11.21 సెకండ్లలోనే అందుకొని రికార్డు సృష్టించాడు. ఈ పోటీని 100 మీటర్లకు లెక్కకడితే శ్రీనివాస గౌడ కేవలం 8.78 సెకండ్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు అధికారులు నిర్ధారించారు. గత వారం వెళ్తాంగండిలో నిర్వహించిన ఈ పోటీల్లో ఎనిమిది మీటర్ల రేసును 8.96 సెకండ్లలో పూర్తిచేసిన శ్రీనివాస గౌడ.. తాజాగా నిర్వహించిన పోటీల్లో తన రికార్డును తానే తిరగరాసాడు.

 శ్రీనివాస గౌడ భారత ఉసేన్ బోల్ట్ గా పేరు సంపాదించాడు. గత ఏడాది కర్ణాటకలో నిర్వహించిన కంబాళ పోటీల్లో ఎద్దుల వెంట అతడు  బురద నీటిలో  మెరుపు వేగంతో  పరుగెత్తడం చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. పరుగులో మనకు కూడా ఉసేన్  బోల్ట్ ఉన్నాడనే గుర్తింపు సాధించాడు. కాగా ఇతడికి మరింత శిక్షణ ఇచ్చి ఒలంపిక్స్ లో  పరుగు పందెం పోటీ లకు పంపడానికి సాయ్ ( స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ముందుకు వచ్చింది. అయితే సాయ్ ఆఫర్ ను శ్రీనివాస గౌడ సున్నితంగా తిరస్కరించాడు. కర్ణాటకలో నిర్వహిస్తున్న కంబాళ  పోటీల్లో మాత్రం సత్తా చాటుకుంటున్నాడు.
Tags:    

Similar News