వాళ్లిద్దరికి ఇప్పుడు మెరీనానే వేదికైంది

Update: 2017-02-18 12:17 GMT
తమిళనాడులో అనూహ్య రాజకీయపరిణామాలు అంతకంతకూ మారిపోతున్నాయి. ఈ రోజు నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పళని స్వామి విజయం సాధించటం తెలిసిందే. అయితే.. అనుకున్నంత సాఫీగా బలపరీక్ష చోటు చేసుకోకపోవటం గమనార్హం. డివిజన్ చేసి బలపరీక్షను చేపట్టాలని స్పీకర్ భావిస్తే.. రహస్య ఓటింగ్ నిర్వహించటం ద్వారా ఓటింగ్ నిర్వహించాలని విపక్ష డీఎంకే డిమాండ్ చేసింది. అయినప్పటికీ.. స్పీకర్ తనకున్న విచక్షణాధికారంతో డివిజన్ ఓటింగ్ కు ప్రాధాన్యత ఇచ్చి.. నిర్వహించారు. ఈ పరీక్షలో పళనిస్వామి పాస్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. సభ నుంచి  డీఎంకే సభ్యుల్ని సస్పెండ్ చేస్తూ..  స్పీకర్ నిర్ణయాన్ని అమలు చేసేపనిలో భాగంగా మార్షల్ వ్యవహరించిన తీరుతో.. స్టాలిన్ చొక్కా పూర్తిగా చినిగిపోవటమే కాదు.. ఆయన్ను ఎత్తేసి తీసుకొచ్చిన వైనం విమర్శలకు తావిచ్చింది. తనపట్ల అనుచితంగా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్టాలిన్.. అసెంబ్లీ నుంచి నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి.. ఫిర్యాదు చేశారు. అనంతరం మెరీనా బీచ్ దగ్గర నిరసన మొదలెట్టారు.

మరోవైపు.. బలనిరూపణ పరీక్షలో పాస్ అయిన పళనిస్వామి.. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి.. నేరుగా మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్దకు చేరుకున్నారు. అమ్మకు నివాళులు అర్పించిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా అధికారపక్ష నేతకు.. విపక్ష నేతకూ తమ తమ భావోద్వేగాల్ని బయటపెట్టుకోవటానికి మెరీనా బీచ్ వేదిక కావటం గమనార్హం. మెరీనా బీచ్ దగ్గర నిరసన చేస్తున్న విపక్ష నేత స్టాలిన్ నుపోలీసులు అరెస్ట్ చేయటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News