టూరిస్టుల‌కు అవి ఉండాల్సిందే అంటున్న మోడీ దోస్తు

Update: 2017-10-07 08:06 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌న్నిహితుడిగా పేరుప‌డిన నీతి ఆయోగ్ ప్రధాన కార్యనిర్వహణాధికారి (సిఇఓ) అమితాబ్ కాంత్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. మద్యం విక్రయాలపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్టు బీజేపీ పాలిత రాష్ర్టాలైన‌ మధ్యప్రదేశ్ - చత్తీస్‌ గఢ్ స‌హా వామ‌పక్షాల ఏలుబ‌డిలో ఉన్న‌ కేరళ ఇటీవల ప్రకటించాయి. గుజరాత్ - బిహార్ - నాగాలాండ్ - మణిపూర్‌ లు ఇప్పటికే మద్యంపై నిషేధం విధించాయి. ఈ నేప‌థ్యంలో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్)కు చెందిన భారత ఆర్థిక శిఖరాగ్ర సమావేశం (ఇండియా ఎకనామిక్ సమ్మిట్)లో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. దేశంలో మద్యంపై నిషేధం మరింత విస్తరిస్తే అది దేశ పర్యాటక పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. దేశంలోకి వచ్చే పర్యాటకులు ఏం తినాలి? ఏం తాగాలి? అనేది నిర్ణయించే పని రాష్ట్ర ప్రభుత్వాలది కాదని అమితాబ్ కాంత్ అన్నారు.

‘ఒక పర్యాటకుడు ఏం తినాలి - తాగాలని కోరుకోవాలో అనే అంశంలో భారతదేశంలోని రాష్ట్రాలు జోక్యం చేసుకోజాలవు. అది సాధ్యం కాదు. ఏం తినాలి - ఏం తాగాలి అనేది సదరు పర్యాటకుడికి సంబంధించిన వ్యక్తిగతమైన అంశం. రాష్ట్రాల పని కాదు’ అని ప్ర‌ధానమంత్రి చైర్మ‌న్‌ గా ఉన్న‌నీతి అయోగ్‌ కు సీఈఓగా ఉన్న అమితాబ్ కాంత్‌ అన్నారు. కొన్ని రాష్ట్రాలు గోమాంసం - మద్యంపై నిషేధం విధించడం వల్ల దుబాయి తరహాలో పర్యాటకులను ఆకర్షించడంలో భారత్ విఫలమవుతుండటంపై ప్రశ్నించగా, ‘నేను రెండు అంశాలను సుదీర్ఘ కాలంగా విశ్వసిస్తున్నాను. పర్యాటకానికి నాగరికత అనేది ముఖ్యం. పర్యాటక స్థలాల్లో చెత్త - మురికి ఉండకూడదు. మాకు గొప్ప వారసత్వ స్థలాలు ఉన్నాయని చాటిచెప్పాలి. అందువల్ల భారత్ స్వచ్ఛతపై కేంద్రీకరించాలి. ఇది మొదటి అంశం. ఇక రెండోది. పర్యాటకుల పర్యటనలు సజావుగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగడానికి ఏర్పాట్లు చేయాలి’ అని ఆయన బదులిచ్చారు.  రోజంతా పర్యటించిన పర్యాటకుడు సాయంత్రం సేద తీరడానికి మద్యం సేవిస్తుంటాడని, అతనికి ఆ అవకాశం కల్పించాలని తాను ఎప్పుడూ చెబుతూ ఉంటానని  సమన్వయకర్త అడిగిన ఒక ప్రశ్నకు అమితాబ్ కాంత్ స‌మాధానమిచ్చారు.

కాగా, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా విస్కీ అమ్మకాలు జరుగుతున్న భారత్‌ లో వాటి కారణంగా సామాజిక రుగ్మతలు ప్రబలుతున్నాయని, ఈ సామాజిక జాడ్యాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని మద్య నిషేధాన్ని సమర్థిస్తున్న వారు వాదిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడమే అనేక రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతోందని వారు పేర్కొంటున్నారు. దేశంలో మద్యం సేవించడం పెద్ద సమస్యగా ఉందని అంటున్నారు.
Tags:    

Similar News