భారత్ మీద ప్రేమను ఒలకబోసిన ‘యాపిల్’ చీఫ్

Update: 2015-09-27 07:03 GMT
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారంతా ‘యాపిల్’ ఉత్పత్తుల్ని కొనేందుకు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అత్యున్నత సాంకేతికతకు నిదర్శనంగా ఉండే యాపిల్ ఉత్పత్తుల పట్ల అందరికి ఆరాధనా భావమే. యాపిల్ ఉత్పత్తుల మీద అభిమానాన్ని భారత్ ప్రజలు చూపిస్తున్నా.. తన ఉత్పత్తుల్ని తొలుత అమెరికా.. యూరప్ దేశాల్లోనే లాంఛ్ చేయటం అలవాటే.

తనను యాపిల్ పెద్దగా పట్టించుకోకున్నా.. ఆ సంస్థ ఉత్పత్తుల మీద మాత్రం భారతీయులు అభిమానాన్ని ప్రదర్శించటం మామూలే. అలాంటి యాపిల్ సంస్థ అధిపతి టిమ్ కుక్ తాజాగా భారత ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్.. గతంలో భారత్ పర్యటన చేపట్టటం.. దానికి కారణం ఇప్పటివరకూ ఎవరికి తెలీదు.

దీనికి సంబంధించిన వివరాలు గుట్టుగా ఉండిపోయాయి. ఆ విషయాన్ని కుక్ తాజాగా ప్రస్తావించారు. స్టీవ్ భారత్ పర్యటన వెనుకున్న రహస్యం గురించి చెబుతూ.. భారత్ కు వెళ్లి వస్తే ఎంతో ప్రేరణ పొందొచ్చని.. ఈ కారణంతోనే స్టీవ్స్ భారత పర్యటనకు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. భారత్ తో తమకెంతో అనుబంధం ఉందని.. భారత మార్కెట్ తమకెంతో ముఖ్యమని చెప్పిన కుక్.. మరి యాపిల్ ఉత్పత్తుల్ని భారత్ లో తొలుత ఎందుకు విడుదల చేయరో చెబితే బాగుంటుంది. ఇండియా నుంచి ఎంతో తీసుకునే యాపిల్.. తిరిగి ఇచ్చే విషయంలో కాస్త పక్షపాత వహిస్తుందన్న విమర్శ విషయంలో ఏం సమాధానం చెబుతారో..?

Tags:    

Similar News