స్టాక్ మార్కెట్లో ట్రంప్ ట్రెండ్.. ఢమాల్

Update: 2016-11-09 05:55 GMT
స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 969 పాయింట్లు నష్టపోయి 26,622 పాయింట్ల వద్ద, నిఫ్టి 327 పాయింట్లు నష్టపోయి 8216 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. మరోవైపు బంగారం ధర కూడా అమాంతం పెరిగింది.
    
అగ్రరాజ్యానికి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కానున్నట్లు ఫలితాల సరళి చెబుతుండడంతో మార్కెట్లపై పెను ప్రభావం పడింది. సెన్సెక్సు ఇటీవల ఎన్నడూ లేనంతగా దారుణంగా పడిపోయింది. లక్షల కోట్ల సంపదకు నష్టం వాటిల్లింది. అమెరికాలో పరిణామలకు తోడు మన దేశంలోనూ మోడీ సర్కారు నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం పెను ప్రభావాన్నే చూపించింది.
    
ఓ వైపు సెన్సెక్సు పాతాళానికి దిగజారగా బులియన్ మాత్రం పరుగులు తీసింది. బంగారం ధర హైజంప్ చేసింది. ఉదయం 10:50 గంటల ప్రాంతంలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1,405 పెరిగి రూ. 31,285 (డిసెంబర్ 5 డెలివరీ)కు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 4.70 శాతం అధికం. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 1,412 పెరిగి రూ. 44,721కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 3.26 శాతం అధికం.
    
ప్రపంచవ్యాప్తంగా మీడియా, నేతలు ట్రంప్ ను బూచిగా చూపిస్తుండడంతో చాలామందికి ఆయనంటే భయం ఏర్పడింది. ట్రంప్ వస్తే అమెరికాతో పాటు ప్రపంచాన్ని కూడా ముంచేస్తాడన్న భయం నెలకొంది. కానీ... అమెరికన్లు మాత్రం ఆయన్నే విశ్విసించడంతో గెలుపు అంచుల్లో ఉన్నాడు. అలాంటి ట్రంప్ ఆధిక్యంలో ఉండడంతో మార్కెట్లు కుదేలయ్యాయి.
    
డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని.. 2017లో డాలర్‌ పూర్తిగా బక్కచిక్కిపోతుందని, బ్యాంకింగ్‌ వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో చిక్కుకని భారీ ఆర్థికమాంద్యలో చిక్కుకుంటుందని ఆర్థికవేత్తలు చెబుతుండడం మార్కెట్ల పతనానికి కారణమవుతోంది.  ఇప్పటికే కొన్ని వారాల నుంచి డాలర్‌ బలహీనపడుతూ వస్తోంది. ఒకవేళ ట్రంప్‌ గెలిస్తే డాలర్‌ మాత్రం కుప్పకూలడం ఖాయమన్న ప్రచారం పెద్ద ఎత్తున ఉంది.
    
ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైతే.. మెక్సికో - టర్కీ - బ్రెజిల్‌ తో పాటు భారత్‌ ను కూడా కలుపుకుంటే ఆయ దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతాయి. ప్రపంచ వాణిజ్యం మందగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను అధికారంలోకి వస్తే మెక్సికో - కెనడాతో వాణిజ్య ఒప్పందాలకు రద్దు చేస్తానని ట్రంప్ హెచ్చరించడం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెన్నుదున్నగా ఉండే పాన్‌ – ఫసిపిక్‌ వాణిజ్య ప్రతిపాదనను ఆయన తిరస్కరించడం.. చైనాతో పాటు కొన్ని దేశాలపై వాణిజ్య ఆంక్షలు విధిస్తానని హెచ్చరించడం వంటివన్నీ మార్కెట్లను ముంచేశాయి.  అంతేకాదు.. ఫెడరల్‌ రిజర్వును వడ్డీరేట్లు పెంచమని ట్రంప్‌ ఒత్తిడి చేసే అవకాశం ఉందన్న వాదనా ఉంది.
    
వీటన్నిటి ఫలితంగా ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుని భద్రత కోసం బంగారంపైన పెట్టుబడి పెడుతున్నారు. దీంతో బులియన్ మార్కెట్ రైజింగ్ లోకి వచ్చి స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కరెన్సీ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు గురవుతున్నాయి.  బ్రెగ్జిట్‌ సమయంలో ఏర్పడిన నష్టం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మార్కెట్లకు ఈ పతనం శరాఘాతమే.
Tags:    

Similar News