త‌మ్ముళ్లు సంబ‌రాలు చేసుకున్నారు.. గెలిచింది మాత్రం వైఎస్!

Update: 2019-04-04 07:23 GMT
ఎన్నిక‌ల వేళ పాత విష‌యాలు గుర్తుకు చేసుకోవ‌టం స‌ముచితం. న‌రాలు తెగిపోయేంత ఉత్కంట‌.. అంత‌కు మించిన భావోద్వేగం.. ఉద్రిక్త‌త‌ల న‌డుమ జ‌రిగిన ఉదంతాల్ని  గుర్తుకొస్తే.. అప్ప‌ట్లో భ‌లే జ‌రిగిందేన‌న్న భావ‌న పాతత‌రం వారికి.. అలా జ‌రిగిందా? అన్న విస్మ‌యం కొత్త త‌రం వారికి మామూలే. అలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నా.. వాటిల్లో ముఖ్య‌మైన ఒక విష‌యాన్ని ఇప్పుడు చెపుకొస్తే..

1996 సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బ‌రిలోకి దిగారు. ఆయ‌న‌కు పోటీగా టీడీపీ త‌ర‌ఫున కందుల రాజమోహన్‌ రెడ్డి పోటీ పడ్డారు. పోలింగ్ పూర్తైన త‌ర్వాత‌.. మే 30న లెక్కింపు జరిగింది. చివర రౌండు పూర్తయ్యే సమయానికి రాజమోహన్‌ రెడ్డి(టీడీపీ)కే ఆధిక్యత ఉంది.

అధికారిక ప్రకటన వెలువడకపోయినా..రాజశేఖర్‌ రెడ్డిపై కందుల రాజమోహన్‌ రెడ్డి గెలుపొందారంటూ తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకొన్నాయి. సోదరుడు ఓటమి పాలవుతుండటాన్ని జీర్ణించుకోలేక పులివెందుల శాసనసభ ఓట్ల లెక్కింపులో ఉన్న వైఎస్‌ వివేకానందరెడ్డి కన్నీరు పెట్టారు. కడప ఆర్ట్స్‌ కళాశాలలో జరిగిన లెక్కింపు కేంద్రం వద్ద వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి గంభీరంగా ఉండిపోయారు. జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూస్తున్న ఆయ‌న కామ్ గా చూస్తుండిపోయారు. ఇదిలా ఉంటే..ఓటమి బాటలో వైఎస్‌ అని టీవీ వార్తల్లోనూ చెప్పేశారు. కడప జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా దానిపైనే చర్చ నడిచింది. వైఎస్ అడ్డాలో ఆయ‌న ఓట‌మా? అన్న‌ది షాకింగ్ గా మారింది.

తెలుగు త‌మ్ముళ్లు చెల‌రేగిపోతూ.. సంబ‌రాలు చేసుకుంటూ హ‌డావుడి చేస్తున్నా ప‌ల్లెత్తు మాట మాట్లాడ‌ని వైఎస్‌.. తాను అనుకున్న‌దే నిజ‌మన్న విష‌యాన్ని చివ‌ర్లో నిరూపించారు. ఎక్క‌డ ఎలాంటి ఫ‌లితం వ‌చ్చినా.. త‌న అడ్డాలో త‌న‌పైన  ప్ర‌జ‌ల‌కున్న న‌మ్మ‌కంపై సందేహం లేకపోవ‌టంతో వైఎస్ కామ్ గా ఉన్నారు.

అదే స‌మ‌యంలో పులివెందుల అసెంబ్లీ ప‌రిధిలో 90 శాతం పోలింగ్ న‌మోదైన 11 కేంద్రాల్లోని బ్యాలెట్ పెట్టెల్ని కౌంటింగ్ కు అధికారులు తీసుకోలేదు. ఆ ఓట్ల‌ను లెక్క‌లోకి తీసుకోవ‌ద్ద‌ని టీడీపీ వ‌ర్గాలు ఫిర్యాదు చేయ‌టంతో వారు లెక్కలోకి తీసుకోలేదు. దీనిపై వైఎస్ త‌న వాద‌న వినిపించ‌టం.. ఓట్ల‌ను లెక్కించాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌టంతో  చివ‌ర‌కు అధికారులు వాటిని లెక్క వేశారు.

ఆ ఓట్ల‌ను లెక్కించిన త‌ర్వాత 5445 ఓట్ల మెజార్టీతో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గెలిచారు.  ఆ ఫ‌లితాన్ని రాత్రి పొద్దుపోయాక ప్ర‌క‌టించారు. గెలిచామ‌న్న అత్యుత్సాహంతో సంబ‌రాలు చేసుకున్న తెలుగుదేశం వ‌ర్గాలు తుది ఫ‌లితం తెలిసిన త‌ర్వాత చిన్న‌బోయాయి. ఎన్నిక‌ల సంద‌ర్భంగా క‌డ‌ప వాసులు.. రాయ‌ల‌సీమ‌లోని ప‌లువురు ఈ ఎన్నిక గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు.
Tags:    

Similar News