వింత ఆచారంః ఆడ‌వాళ్లు మగాళ్లుగా మారిపోతారు..!

Update: 2021-06-23 02:30 GMT
ఈ ప్ర‌పంచంలో ఎన్నో జాతులు ఉన్నాయి.. మ‌రెన్నో తెగ‌లు ఉన్నాయి.. వీటి మ‌ధ్య ఇంకెన్నో వ‌ర్గాలున్నాయి. ఇక‌, ఆచార సంప్ర‌దాయాల గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. అందునా.. పెళ్లి ఆచారాలంటే తీరొక్క ప‌ద్ధ‌తిలో ఉంటాయి.  ఒక్క వ‌ర్గంలోనే ప్రాంతాల‌ను బ‌ట్టి అవి మారిపోతుంటాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌నం ఎన్నో ఆచారాల‌ను చూసి ఉండొచ్చు. ఇది మాత్రం అంత‌కు మించి!

ఇది కూడా ఎక్క‌డో కాదు.. మ‌న తెలుగు రాష్ట్రంలోనే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌కాశం జిల్లా పెద్ఆర‌వీడు మండ‌లం బి.చెర్లోప‌ల్లి గ్రామంలో మాత్రమే ఈ ఆచారం అమ‌ల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే.. కేవ‌లం స్వ‌ర్ణ‌, గుమ్మా అనే ఇంటి పేర్లు క‌లిగిన కుటుంబాలు మాత్ర‌మే ఈ ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తున్నాయి.

గుమ్మా అనే ఇంటిపేరు క‌లిగిన వారి ఇంట్లో ఈ మ‌ధ్య పెళ్లి జ‌రిగింది. పెళ్లి అంద‌రిలాగానే నిర్వ‌హించారు. అబ్బాయి-అమ్మాయిని వ‌ధూవ‌రుల స్థానంలోనే ఉంచి వివాహం జ‌రిపించారు. కానీ.. ఆ త‌ర్వాతే ప‌ద్ధ‌తి మారిపోయింద‌క్క‌డ‌. పెళ్లి త‌ర్వాత పోలేర‌మ్మ‌, అంకాల‌మ్మ దేవ‌త‌ల‌కు పూజిస్తారు. ఇది వారి ఆచారం.

ఈ ఆచారంలో భాగంగా.. పెళ్లి కూతురికి అబ్బాయి వేషం వేయిస్తారు. వ‌స్త్రాధార‌ణ నుంచి అన్నీ అబ్బాయిలా ఉండేలా చూస్తారు. వ‌రుడికి సైతం ఇదే విధంగా అమ్మాయి వేషం వేయిస్తారు. చీర క‌ట్టి, క‌ట్టుబొట్టుతో సింగారిస్తారు. ఆ త‌ర్వాత మేళ‌తాళాల‌తో జ‌మ్మి చెట్టు, నాగుల పుట్ట‌ వ‌ద్ద‌కు తీసుకెళ్లి పూజ‌లు చేయిస్తారు.

ఇది త‌మ‌కు మాత్ర‌మే సొంత‌మైన సంప్ర‌దాయం అని చెబుతున్నారు ఈ కుటుంబాల‌కు పెద్ద‌లు. మ‌ర్కాపురం, కురిచేడు, అర్ధ‌వీరు, కంభం మండ‌లాల్లోని సుమారు 150 కుటుంబాలు ఈ ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తున్న‌ట్టు చెప్పారు. త‌రాలు మారినా, కాలం మారినా.. త‌మ ప‌ద్ధ‌తి మాత్రం మార్చుకునేది లేద‌ని చెబుతున్నారు. భ‌లేగా ఉంది క‌దూ.. ఈ సంప్ర‌దాయం!
Tags:    

Similar News