భారీగా వింత శబ్దాలు.. పగిలిపోయిన కిటికీలు.. పరిగెత్తిన జనం!

Update: 2021-07-02 13:30 GMT
క‌ర్నాట‌క‌లో వింత ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాజధాని బెంగళూరులో వింత వింత శబ్దాలు భారీ స్థాయిలో వినిపించడం.. తలుపులు, కిటికీలో కొట్టుకోవడంతో జనం భయాందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయని స్థానికులు తెలిపారు. దీంతో.. భూకంపం వచ్చిందేమోనని బెంగళూరు వాసులు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు.. దీనికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకునే ప‌నిలో ప‌డ్డారు.

బెంగ‌ళూరులోని ప‌లు ప్రాంతాల్లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12.30 ప్రాంతంలో ఈ ప‌రిస్థితి త‌లెత్తింది. ఈ కార‌ణంగా ప‌లు ఇళ్ల‌లో అద్దాల కిటికీలు ధ్వంస‌మ‌య్యాయి. న‌గ‌రంలోని మ‌హ‌దేవ‌పుర, సిల్క్ బోర్డ్‌, బొమ్మ‌న‌హ‌ళ్లి, మ‌డివాల‌, అగ‌ర‌, హుళిమావు, అనేక‌ల్‌, హెచ్ ఎస్ ఆర్ లే-అవుట్‌, ప‌ద్మనాభ న‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో ఈ శ‌బ్దాలు వినిపించిన‌ట్టుగా చెబుతున్నారు.

ఇంకా.. అర్జాపూర్‌, జేపీన‌గ‌ర్‌, ఉల్సూర్, బెన్స‌న్ టౌన్‌, సౌత్‌, ఈస్ట్ బెంగ‌ళూరులో కూడా ఈ వింత శ‌బ్ధాలు వినిపించిన‌ట్టు స్థానికులు తెలిపారు. ఈ మేర‌కు జ‌నాలు సోష‌ల్ మీడియాలో త‌మ అనుభ‌వాన్ని పంచుకున్నారు. తొలుత ఒక్క‌రిద్ద‌రు చెప్ప‌గా.. అంద‌రూ లైట్ తీసుకున్నారు. కానీ.. ఒక్కొక్క‌రుగా వివిధ ప్రాంతాల్లోని వారంతా ఇదే త‌ర‌హా విష‌యం చెప్ప‌డంతో.. అంద‌రూ అల‌ర్ట్ అయ్యారు.

అయితే.. ఇటువంటి శ‌బ్దాలు గ‌తేడాది కూడా వినిపించాయ‌ని, ఇది ఇయ‌ర్లీ ప్రోగ్రామ్ అని ప‌లువురు నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్ చేశారు. కొంద‌రు మాత్రం.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్ర‌యం నుంచి శిక్ష‌ణ యుద్ధ విమానం ఎగురుతున్న కార‌ణంగానే ఈ శ‌బ్ధాలు వినిపించిన‌ట్టు చెబుతున్నారు. అయితే.. దీనిపై స్పందించ‌డానికి హెచ్ ఏఏఎల్ నిరాక‌రించిన‌ట్టుగా తెలుస్తోంది.

యుద్ధ‌విమానాలు, శిక్ష‌ణ విమానాలు ప్ర‌యాణించ‌డం అనేది నిత్యం జ‌రిగేదేన‌ని, ఇవాళ ప్ర‌త్యేకంగా ఏమీ జ‌ర‌గ‌లేద‌ని, కాబ‌ట్టి.. ఆ శ‌బ్దాల‌కు, హెచ్ ఏఏఎల్ కు సంబంధం లేద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధి ఒక‌రు మీడియాకు తెలిపారు. దీంతో.. మ‌రి, ఈ శబ్ధానికి గ‌ల కార‌ణం ఏంట‌న్న‌ది మాత్రం అధికారికంగా ఇంకా నిర్ధార‌ణ కాలేదు. పోలీసులు మాత్రం ఆరాతీస్తున్నారు.
Tags:    

Similar News