పిచ్చికుక్కల బీభత్సం..50మందికిపైగా గాయాలు

Update: 2020-01-22 05:48 GMT
హైదరాబాద్ లోని అమీర్ పేటలో పిచ్చికుక్కలు హడలెత్తించాయి. మంగళవారం మధ్యాహ్నం రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, పాదచారులపై మొదట ఓ పిచ్చికుక్క దాడి చేసింది. కేవలం మూడు గంటల్లోనే ఆ పిచ్చికుక్క 50మందికి పైగా దాడి చేసి బీభత్సం సృష్టించింది.

ఇక ఈ పిచ్చికుక్క మనుషులనే కాదు.. ఇతర కుక్కలను కూడా కరిచింది. దీంతో వాటికి కూడా పిచ్చి లేసి ఆ కుక్కలన్నీ ప్రజలపై దాడి చేశాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ పిచ్చికుక్కల స్వైర విహారం కొనసాగింది.

హైదరాబాద్ లోని సోమాజీగూడ సీఎం క్యాంపు కార్యాలయం ఎదురువీధి - ధరంకరం రోడ్డు - శివబాగ్ - సత్యం థియేటర్ పరిసర ప్రాంతాల్లో 50మందికి పైగా కుక్కకాటుకు గురయ్యారు.

జీహెచ్ ఎంసీ రంగంలోకి దిగి కుక్కలను వేటాడింది. అయితే అంతలోపే స్థానికులు కుక్కలను కొట్టి చంపారు. కుక్కల దాడుల్లో గాయపడిన 77మందిని చికిత్స కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రితోపాటు వివిధ ఆస్పత్రులలో చేర్పించారు. ఈ దాడుల్లో బేగంపేటకు చెందిన ఓ డాక్టర్ తోపాటు అమీర్ పేటలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు.


Tags:    

Similar News