జీఎస్‌ టీ దూకుడుతో ఓడిపోయే చాన్స్!!

Update: 2017-06-06 05:22 GMT
విష‌యం ఏదైనా త‌న మ‌న‌సులో ఉన్న భావ‌న‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్ప‌డంలో ముందుండే బీజేపీ నేత - ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మ‌రోమారు త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు వినిపించారు. మ‌న‌దేశంలో అతిపెద్ద పన్ను సంస్కరణగా భావిస్తున్న జీఎస్‌ టీని జులై 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా సుబ్రహ్మ‌ణ్య‌స్వామి దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జులై 1 డెడ్‌ లైన్‌ ఓకే..అయితే 2019 నుంచి అమలు కావాలని ట్వీట్‌ చేశారు.

2019లోగా జీఎస్‌ టీ అమలుకు పూనుకుంటే అది అతిపెద్ద రిస్క్‌ అవుతుందని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయ‌ప‌డ్డారు. జీఎస్‌ టీ అమలుకు రాష్ట్రాలు సర్వసన్నద్ధంగా లేవని అన్నారు. అందుకే ఇప్పటికిప్పుడు జీఎస్‌ టీ అమలుకు దిగితే అది 'వాటర్‌ లూ' అనుభవం కాగలదని హెచ్చరించారు. ఫ్రెంచ్‌ సైనిక నాయకుడు - రాజు నెపోలియన్‌ బొనాపార్టే ఓటమికి చిహ్నంగా 1815 - జూన్‌ 18న వాటర్‌ లూ యుద్ధం  చరిత్రపుటల్లోకి ఎక్కింది. జీఎస్‌ టీ అమ‌లు విష‌యంలో నెపోలియ‌న్ ఓట‌మిని బీజేపీ నేతగా ఉన్న‌ సుబ్రహ్మణ్య స్వామి ప్ర‌స్తావించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలాఉండ‌గా...సుబ్రహ్మణ్య స్వామితో పాటు పలువురు నిపుణులు - పరిశ్రమ వర్గాలు జీఎస్‌ టీ అమలును వాయిదా వేయాలని కోరుతున్నాయి. బ్యాంకులు కూడా నూతన పన్ను వ్యవస్థకు అవసరమైన యంత్రాంగం - మౌలిక సదుపాయాలను పూర్తిగా అందిపుచ్చుకోలేదు. జులై 1 నుంచి నూతన పరోక్ష పన్ను వ్యవస్థ జీఎస్‌ టీ అమలుకు బ్యాంకులు ఇంకా సిద్ధం కాలేదని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ) పార్లమెంటరీ కమిటీకి లేఖ రాసింది. జీఎస్‌టీ అమలుకు బ్యాంకులు తమ చెల్లింపు వ్యవస్థలు,ఇతర విధానాల్లో మార్పులు చేపట్టాల్సి ఉందని, 2017, జులై 1 నుంచి జీఎస్‌ టీ అమలుకు బ్యాంకుల సన్నద్ధత ప్రశ్నార్థకమేనని ఆర్థిక వ్యహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి ఐఓబీ నివేదించింది. జీఎస్‌ టీ విధానం కోసం బ్యాంకులు తమ ప్రస్తుత మౌలిక సదుపాయాలను పూర్తిగా మార్చాల్సిరావడం సవాల్‌ గా పరిణమించిందని ఐఓబీ స్పష్టం చేసింది.బ్యాంకులు సిద్ధం కాని పక్షంలో జీఎస్‌ టీ అమలు పెద్దనోట్ల రద్దు ప్రహసనం మాదిరిగానే ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మ‌రోవైపు జీఎస్‌ టీ అమలైతే వ్యవసాయ ఉత్పాదక వ్యయం పెనుభారమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఎరువులపై జీఎస్‌ టీలో 12 శాతం పన్ను విధిస్తారు. ప్రస్తుతం ఎరువులపై వ్యాట్‌ కింద సున్నా నుంచి 8 శాతం పన్ను విధిస్తున్నారు. దీంతో జీఎస్‌ టీ అమలైతే ఎరువులపై కనీసం నాలుగు శాతం అదనంగా పన్ను భారం పడనుంది. ఎరువులతో పాటు క్రిమిసంహారక మందుల ధరలూ పెరుగుతాయి. ప్రస్తుతం పెస్టిసైడ్స్‌పై వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ కింద 4-5 శాతం పన్ను విధిస్తుండగా, 12 శాతం సెంట్రల్‌ ఎక్సయిజ్‌ సుంకం విధిస్తున్నారు. జీఎస్‌ టీ అమలైతే పన్నులు మరింత పెరగనున్నాయి. ఇక ట్రాక్టర్లపై రాష్ట్రాలు 4-5 శాతం వ్యాట్‌ విధిస్తుండగా, సెంట్రల్‌ ఎక్సయిజ్‌ సుంకాన్ని మినహాయించారు. జీఎస్‌ టీలో మాత్రం ట్రాక్టర్లపై 12 శాతం పన్ను విధించనుండటంతో ట్రాక్టర్ల ధరలకు రెక్కలు రానున్నాయి. ట్రాక్టర్ల విడిభాగాలు - యాక్సెసరీలు జీఎస్‌ టీలో 28 శాతం పన్ను శ్లాబ్‌ లోకి వచ్చాయి. అసలే అంతంతమాత్రంగా ఉన్న అన్నదాత పరిస్థితి జీఎస్‌ టీతో మరింత దుర్భరంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News