ఇలాంటి నిర్ణయాలే జగన్ సర్కారుకు ఆయుధాలు

Update: 2023-01-21 10:30 GMT
తప్పులు ఎన్ని చేసినా సరే.. సరైన సమయంలో సరైన నిర్ణయం ఒక్కటి తీసుకున్నా పరిస్థితుల్లో మార్పు వస్తుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో జగన్ సర్కారును అభినందించాల్సిందే. తప్పులు ఎన్ని చేసినా.. కొన్ని విషయాల్లో తీసుకునే కొన్ని నిర్ణయాలు పార్టీలకు అతీతంగా అభినందించేలా ఉంటాయి.

నిజానికి.. జగన్ తన మొండితనాన్ని విడిచి పెట్టి.. రాజకీయ విభేదాలకు అతీతంగా పాలన సాగించి ఉంటే.. ఆయన పరిస్థితి వేరుగా ఉండేది. ఏపీ రాష్ట్ర పరిస్ధితి మరోలా ఉండేది. అందుకు భిన్నంగా రాజకీయ ప్రత్యర్థుల సంగతి చూసే విషయంలో జగన్ అనుసరించే విధానాలే ఆయన్ను వేలెత్తి చూపించేలా మారాయని చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొన్ని పదవుల విషయంలో కొందరిని ఎంపిక చేసుకునే విషయంలో జగన్ సర్కారు నిర్ణయాలు అందరిని ఆకట్టుకునేలా ఉంటాయి. తాజాగా అలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీలో సమున్నత గౌరవం లభించింది.

ఆయన్ను టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమిస్తూ హెచ్ డీపీపీ కార్యనిర్వాహఖ కమిటీ నిర్ణయం తీసుకుంది.ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి స్వయంగా వెల్లడించారు. తాజాగా హెచ్ డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ నిర్వహించిన సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రవచనకర్తగా తెలుగువారందరికి సుపరిచితమైన చాగంటి వారు వాక్కు మాదిరే.. ఆయన వ్యవహారశైలి సైతం సున్నితంగా.. కచ్ఛితంగా ఉంటుందని చెబుతారు.

అలాంటి ఆయనకు టీటీడీలో కీలక పదవిని అప్పజెప్పటం చూసినప్పుడు అందరికి ఆమోదయోగ్యంగానే కాదు.. జగన్ సర్కారును అభినందించేలా ఉంటుందని చెప్పాలి. చాగంటివారి ప్రతిభను.. ఆయన సమర్థతకు తగిన పదవిని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించే విషయంలో ఇప్పటికే ఆలస్యం చేశాయని చెప్పాలి. అందుకు పరిహారంగా జగన్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారంతా ఆనందించేలా చేస్తుందని చెప్పక తప్పదు. ఇలాంటి నిర్ణయాలే జగన్ సర్కారు మీద సానుకూలతను పెంచేలా చేస్తాయన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News