సుద్దాల అశోక్ తేజకు షాక్..ద్రోహుల్ని ఆయన సభకు పిలిచారా?

Update: 2019-10-14 11:46 GMT
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు అనుకోని షాక్ తగిలింది. తన ఇంటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని భావించిన ఆయనకు అనుకోని రీతిలో నిరసన ఎదురుకావటం.. విమర్శలకు గురి కావటం విశేషం. తన కుటుంబ సభ్యులైన సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఇందుకోసం భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.

తాజాగా ఈసారి జాతీయ పురస్కారాన్ని ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తికి బహుకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో సహా పలువురు అధికార పక్ష నేతలు హాజరయ్యారు. కొద్ది రోజులుగా జరుగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో.. వారి విషయంలో ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందన్న ఆగ్రహం పలువురు ఉద్యమకారుల్లో ఉంది.

గడిచిన రెండురోజుల్లో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవటం.. వారిద్దరి మరణాలు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన కారణంగానే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సుద్దాల అశోక్ తేజ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పలువురు ఉద్యమకారులు నిలదీయటమే కాదు.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సుద్దాల అశోక్ తేజను సైతం తప్పు పట్టారు. తెలంగాణ ద్రోహుల్ని కార్యక్రమానికి ఎందుకు పిలిచారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన తీవ్రంగా నొచ్చుకున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News