షాకింగ్ న్యూస్‌: పాలిటిక్స్‌ లోకి సుహాసిని?

Update: 2017-10-05 04:09 GMT
రాజ‌కీయాలు హాట్ హాట్‌ గా మారుతున్నాయి. తెర‌మీద ఓ వెలుగు వెలిగి.. తెర‌వేల్పులుగా పూజ‌లందుకున్న న‌టులు ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు క్యూ క‌డుతున్నారు. నిన్న‌టినిన్న త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌ - విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌ లు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయి అభిమానుల‌ను ఉర్రూత లూగించారు. ర‌జ‌నీ విష‌యంలో సొంత పార్టీ పెడ‌తాడా లేక బీజేపీతో చేతులు క‌లుపుతాడా అన్న విష‌యం ఊగిస‌లాడుతుండ‌గా.. శ‌భాష్ నాయుడు మాత్రం వ‌చ్చే నెల 7న పార్టీ పెడుతున్న‌ట్టు ఊహాగానాలు వెల్లువెత్త‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యంలో మునిగిపోయారు. ఇక‌, ఇప్ప‌టికే ఎంతో మంది న‌టీన‌టులు రాజ‌కీయాల్లో ఆరితేరుతున్నారు.

అయితే, తాజాగా మ‌రో సీనియ‌ర్ న‌టి - ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం స‌తీమ‌ణి - క‌మ‌ల్ హాస‌న్ అన్న కూతురు సుహాసిని కూడా పొలిటిక‌ల్ క‌ల‌ర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు ఈ వార్త అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోను - ఇటు సినీ జ‌నాల్లోనూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అత్యంత మృదు స్వ‌భావి - వివాద ర‌హిత న‌టి - అగ్ర ద‌ర్శ‌కుడి భార్య కావ‌డంతో సుహాసిన చేసిన తాజా పొలిటిక‌ల్ స్టేల్ మెంట్ అంద‌రినీ ఉత్కంఠ‌కు గురి చేస్తోంది. ఇంత‌కీ సుహాసిని ఏమ‌న్నారు?  ఎలాంటి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు?  ఇప్పుడు చూద్దాం..రజనీకాంత్ - కమల్‌ హాసన్‌ రాజకీయ రంగప్రవేశం గురించి సుహాసిని తాజాగా స్పందించారు.

``హీరోలే రాజకీయాల్లోకి రావాలా - మేము రాజకీయాల్లోకి రాకూడదా?`` అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈమె ప్రశ్నించారు.  ‘ప్రజలు జయలలితకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చారు. మాకూ ఆ బాధ్యతలను అందించండి. రాజకీయాల్లోకి రావడానికి మేమూ సిద్ధమే’ అని వ్యాఖ్యానించారు. దీంతో నటులకే కాదు నటీమణులకు పొలిటికల్ ఫీవర్ పట్టుకుందంటూ కథనాలు వ‌స్తున్నాయి. ఇక, సీనియ‌ర్ నటీమణులు రాధిక - రేవతి - పూర్ణిమా భాగ్యరాజ్ - నదియా వంటి వారు కూడా రాజకీయాల్లోకి రావడానికి సై అంటున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఒక‌ప్పుడు సినీ రంగంలో హేమా హేమీలుగా వెలిగిన హీరోయిన్లే. ప్ర‌స్తుతం వీరిలో కొంద‌రు బుల్లి తెర‌పై జ‌నాల్ని క‌ట్టిప‌డేస్తున్నారు.

మ‌రికొంద‌రు నిర్మాణ సంస్థ‌ల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు వీరంతా దివంగ‌త జ‌య‌ల‌లిత రూట్ ను ఎంచుకునేందుకు సిద్ధ ప‌డుతుండ‌డం అటుంచి.. పురుషాధిక్య రాజ‌కీయాల‌ను ప్ర‌శ్నిస్తుండ‌డం చాలా ఆస‌క్తిగా మారింది. కాబ‌ట్టి రాబోయే రోజుల్లో వీరిలో ఒక‌రిద్ద‌రు ఖ‌చ్చితంగా పొలిటిక‌ల్ గ్రౌండ్‌ లోకి వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టికైతే.. సుహాసినీ క‌న్ఫ‌ర్మ్ అని తెలుస్తోంది. ఎలాగూ ఆమె బాబాయి - విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ పార్టీ స్థాపిస్తుండ‌డంతో ఆమె రాజ‌కీయాల్లోకి వ‌స్తే... క‌మ‌ల్ స్థాపించ‌బోయే పార్టీలో చేరే ఛాన్స్ ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 56 ఏళ్ల సుహాసిని.. క‌మ‌ల్ సోద‌రుడు చారు హాస‌న్ కుమార్తె కావ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News